జగన్ ఆలోచన ఫెయిలైందా ?

ప్రతి నియోజకవర్గం నుంచి సరైన ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఫెయిలైనట్లే అనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది కార్యకర్తలతో భేటీ అవ్వాలని జగన్ ఆలోచించారు. నియోజకవర్గంలో జనాభిప్రాయం ఎలాగుంది ? ప్రభుత్వం పనితీరు ఎలాగుంది ? పార్టీలో సమస్యలు ఏమిటి ? వాటికి కారణాలు+పరిష్కారాలను కనుక్కునేందుకు జగన్ సమావేశాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

అనుకున్నట్లుగా కుప్పం, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ ఉద్దేశ్యం మాత్రం నెరవేరలేదని సమాచారం. ఎందుకంటే తమ నియోజకవర్గం ఎంఎల్ఏని లేదా మంత్రిని సమావేశంలో జగన్ కూర్చోబెట్టుకుని మాట్లాడమంటే కార్యకర్తలు స్వేచ్చగా ఎలా మాట్లాడగలరు ? మంత్రిపైనో లేదా ఎంఎల్ఏ పైనే ఏమైనా ఫిర్యాదులు చేయాలంటే ఎలా చేయగలరు ? మంత్రి, ఎంఎల్ఏ ఆలోచనలకు భిన్నంగా కార్యకర్తలు జగన్ కు ఏమని చెప్పగలరు ?

ఈ సమస్యలన్నీ ఒకవైపుండగానే మరోవైపు కార్యకర్తలు మాట్లాడటానికి జగన్ పెద్దగా అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. కార్యకర్తలు ఎలా పనిచేయాలి ? పార్టీని ఎలా గెలిపించాలనే విషయాలపై జగన్ ఉపన్యాసాలిచ్చారు. ఉపన్యాసాలు ఇవ్వటానికి ప్రత్యేకంగా 50 మంది కార్యకర్తలను తన దగ్గరకు పిలిపించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రత్యేకించి కార్యకర్తలను పిలిపించుకున్నారంటే వాళ్ళనుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్ బ్యాక్ తీసుకోవాలంటే వాళ్ళతో మాట్లాడించాలి జగన్ వినాలంతే.

నియోజకవర్గం ఇన్చార్జో లేదా ఎంఎల్ఏ, మంత్రిని భేటీకి పిలవకూడదు. వాళ్ళు లేకుండానే జగన్ కార్యకర్తలతో భేటీ అవ్వాలి. అప్పుడే తాము చెప్పదలచుకున్న విషయాలను కార్యకర్తలు స్వేచ్చగా చెప్పగలరు. ఇలా జరగలేదు కాబట్టే కార్యకర్తలతో భేటీల ఆలోచన ఫెయిలైనట్లుంది. ఇలాంటి భేటీల వల్ల సమయం దండగ అని అనుకున్నట్లున్నారు. కొద్దిరోజులుగా ఇలాంటి భేటీలు నిర్వహించటం లేదు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఆర్భాటంగా కార్యక్రమాన్ని ప్రకటించటం, మధ్యలోనే ముగించేయటం జగన్ కు అవసరమా ?