బీజేపీ-వైసీపీ లవ్.. ఇక దాచేదేముంది?

పైకి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని శత్రువులా ప్రొజెక్ట్ చేస్తారు ఆంధ్రా బీజేపీ వాళ్లు. జగన్ సర్కారు మీద విమర్శలు కూడా చేస్తుంటారు. మరోవైపు వైసీపీ వాళ్లు సైతం బీజేపీ తమ శత్రు పక్షం అన్నట్లే వ్యవహరిస్తారు. కానీ వాస్తవంగా మాత్రం ఈ రెండు పార్టీల మధ్య చీకటి బంధం ఉందని ఎప్పటికప్పుడు పరిణామాలు రుజువు చేస్తూనే ఉంటాయి. ఎన్డీఏ సర్కారుకు పార్లమెంటులో ఎప్పుడు మద్దతు అవసరం అయినా మేమున్నాం అటూ జగన్ పార్టీ నిలబడుతుంది. బేషరతుగా మద్దతు ఇచ్చేస్తోంది.

తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం అన్న జగన్.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అలాంటి షరతు పెట్టేందుకు అవకాశం ఉన్నా కూడా కిమ్మనకుండా పార్టీ తరఫున మద్దతు ప్రకటించడం చూసి అందరూ నివ్వెరపోయారు. తనను అన్నన్ని కేసులు వెంటాడుతుంటే.. ఇక జగన్ ప్రత్యేక హోదా గురించి ఏం అడుగుతాడనే విమర్శలు గట్టిగా వినిపించాయి ప్రతిపక్ష పార్టీల నుంచి.

ఐతే ప్రతిసారీ వైసీపీ నుంచి సాయం అందుకోవడమేనా.. ప్రతిగా బీజేపీ ఏం చేయదా అన్న అనుమానాలకు ఇప్పుడు సమాధానం దొరికింది. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రాగా.. ఈ వేడుకకు స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆహ్వానం పలకలేదు పీఎంవో. ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో ఎంపీ హాజరవ్వాలి. కానీ వేరే రాష్ట్రాల్లో అయితే విధిగా స్థానిక ఎంపీకి ఆహ్వానం అందుతుంది. వేదిక మీద చోటూ దొరుకుతుంది. కానీ వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామ ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడం తెలిసిందే.

ఆయన ఈ వేడుకలో పాల్గొంటే, వేదిక ఎక్కితే జగన్ అండ్ కోకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే తాము పీఎంవోకు పంపిన అతిథుల జాబితాలో ఎంపీ పేరు తీసేశారు. పీఎంవో కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లోనే కాక ప్రతిసారీ తమకు ఇంత మద్దతు అందిస్తున్నపుడు ఈ చిన్న సాయం చేయలేమా అన్నట్లు మోడీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని మన్నించినట్లుంది. ఈ వేడుకకు మర్యాదపూర్వకంగా అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించకపోవడం, అలాగే ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు అతిథుల జాబితాలో చోటివ్వడాన్ని బట్టి కూడా బీజేపీ ప్రాధామ్యాలు ఏంటో, వైసీపీతో ఆ పార్టీ బంధం ఎలాంటిదో స్పష్టంగా తెలిసిపోతోంది.