ఆంధ్రావనిలో సర్కారు తరఫున భూముల వేలాన్ని అడ్డుకుంటూ, వద్దని చెబుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గాల అత్యుత్సాహంపై హైకోర్టు నీళ్లు జల్లింది. భూములను ప్రభుత్వం వేలం వేయడం ఏంటన్నది కోర్టు వారి ప్రశ్న. పేదలకు ఇవ్వాల్సిన భూములను కార్పొరేషన్ పేరిట ఎలా బహిరంగ మార్కెట్లో వేలం వేస్తారని కూడా అంటోంది. దీంతో జగన్ సర్కారు పునరాలోచనలో పడిపోయింది.
విశాఖ కేంద్రంగా జరుగుతున్న భూముల వేలం అన్నది ఇప్పుడొక చర్చకు తావిస్తోంది. రాజీవ్ స్వగృహ పేరిట ఇళ్లు కట్టించాల్సి పోయి, రాజీవ్ కార్పొరేషన్ పేరిట ఇళ్ల స్థలాలను అమ్ముకోవడం ఏంటి అన్నది ప్రధాన అభ్యంతరంగా ప్రధాన న్యాయమూర్తి నిన్నటి వేళ పేర్కొన్నారు. దీంతో ఇప్పటిదాకా చేపట్టిన సంబంధిత ప్రక్రియను నిలుపుదల చేయాలని చెబుతూ
హై కోర్టు స్టే ఇచ్చింది.
ఇక్కడ రాజీవ్ గాంధీ స్వగృహ పేరిట 22 వేల చదరపు గజాల స్థలాన్ని వేలం వేస్తున్నామని సర్కారు చెబుతోంది అని, కానీ ఐదు ఎకరాల విస్తీర్ణాన్నీ తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా అమ్ముకోవాలని చూస్తోందని హైకోర్టు మండిపడింది. ఈ విధంగా చేయడం తగదని అంటోంది. ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమిని తక్కువ విస్తీర్ణం ఉన్న భూమి కింద ఎలా చూపిస్తారని అభ్యంతరం చెబుతూ సర్కారు తీరును తప్పుపడుతూ తన తరఫు వాదనను బలీయంగా వినిపిస్తూ వైసీపీకి ఓ విధంగా ఝలక్ ఇచ్చింది.
విశాఖ జిల్లా, ఎండాడ గ్రామ పరిధిలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను (ఒకటి మరియు ఆరో నంబర్ ప్లాట్లను) ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తూ వెలగపూడి రామకృష్ణ అనే ఎమ్మెల్యే (విశాఖ తూర్పు ఎమ్మెల్యే) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించిన పిటిషనర్ తరఫు న్యాయవాది పేద మరియు మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు 2007లో వైఎస్సార్ హయాంలో రాజీవ్ స్వగృహను తీసుకువచ్చారని, ఇందులో భాగంగా 2009లో 54.19 ఎకరాలను కేటాయిస్తే అందులో స్థలాన్ని ఇప్పుడు ప్లాట్లుగా చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అమ్ముకోవాలని చూడడం ప్రాజెక్టు స్ఫూర్తికే విఘాతం అని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని హైకోర్టుకు ప్రభుత్వ తరఫున న్యాయవాది అభ్యర్థించినా, ఈ నెల 30 ప్లాట్ల విక్రయం ఉందని అంటున్నారు కనుక ఉత్తర్వులు ఇవ్వక తప్పదని కోర్టు స్పష్టం చేసింది.