జంపింగుల‌కే.. జ‌గ‌న్ వీర‌తాళ్లు.. వైసీపీలో మంట‌లు

వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే న‌లుగురి జాబితా రెడీ అయిందా? ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఖ‌రారు చేశారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ స‌భ్యులను ఖ‌రారు చేసే ప‌నిని పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌద‌రి, విజ‌య‌సాయిరెడ్డి, టీజీ వెంక‌టేశ్‌, సీఎం ర‌మేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా.. వైసీపీకే ద‌క్క‌నున్నాయి.

అయితే.. ఈ నాలుగు స్థానాల కోసం.. పార్టీలోతీవ్ర‌మైన పోటీ ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం జంపింగుల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇదే ఇప్పుడు.. వైసీపీలో మంట‌లు రేపుతున్నాయి. నిజానికి జాబితా ఇంకా బ‌య‌ట‌కు రాక‌పోయినా.. పార్టీ అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాల‌ను బ‌ట్టి..ఈ సీట్లను ఆశించిన నాయ‌కులు.. మాత్రం ర‌గిలిపోతున్నారు.

జాబితాలో ఆ న‌లుగురు వీరేనా!?

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారని స‌మాచారం. అలాగే వైసీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి గానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్‌ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం.

అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్‌ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావు కు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో.. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఎంపిక‌లో ప‌ద‌నిస‌లు..

  • కిల్లి కృపారాణి.. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వ‌చ్చారు. అంత‌కు ముందు.. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వారి జాబితాలో ఈమె ముందున్నారు.
  • బీద మస్తాన్‌రావు.. ఈయ‌న కూడా 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి జంప్ చేసి.. వైసీపీలో చేరారు. ఈయ‌న‌కు నెల్లూరు ఎంపీ టికెట్‌ ఖ‌రారు చేసిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబుకు బై చెప్పి రావ‌డం గ‌మ‌నార్హం.
  • వైసీపీలో ఎంతో మంది సీనియ‌ర్లు.. గ‌త 10 సంవ‌త్స‌రాలుగా సేవ‌లు అందిస్తున్నవారు ఉన్నా.. వారిని ప‌ట్టించుకోకుండా..జంపింగుల‌కు ఛాన్స్ ఇవ్వ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.
  • న‌టుడు అలీకి ఇస్తార‌ని అనుకున్నా.. చివ‌రి నిముషంలో ఆయ‌న‌ పేరును ఎంపిక జాబితా నుంచి తొల‌గించిన‌ట్టు స‌మాచారం.