రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆదాయ మార్గాల వైపే చూస్తారు. ఉన్న వ్యాపారాలను పెంచుకోవడం, కొత్తగా ఆదాయం పొందడానికి చూడటం.. ఇదే జరుగుతుంటుంది. తమ పార్టీ తరఫున ఏవైనా సహాయ కార్యక్రమాలు చేసినా.. అవి పార్టీకి వచ్చే విరాళాలతోనే చేస్తారు. లేదంటే పార్టీలో ఉన్న బిగ్ షాట్లతో ఖర్చు పెట్టిస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం. ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులతోనే పార్టీని నడుపుతూ వస్తున్నారు.
జనసైనికులు, పార్టీ మద్దతుదారులు ఏమీ ఆశించకుండా ఇచ్చే చిన్న చిన్న విరాళాలు కూడా దానికి తోడవుతుంటాయి. సినిమాల్లో నటించడం గురించి ఎన్నో విమర్శలు చేస్తుంటారు కానీ.. అక్కడొచ్చే డబ్బులతో పవన్ ఏ స్థాయిలో సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడో, పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలకు కూడా ఎంత తోడ్పాటునందిస్తున్నాడో చూడరు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాల కోసం తన వ్యక్తిగత డబ్బులు ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించి.. ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పవన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ మీద ప్రశంసల జల్లు కురిసింది. ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో మొదలుపెట్టిన సందర్భంగా పవన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్య అందించేందుకు ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు. ఇది తాము అధికారంలోకి వచ్చాక చేస్తామన్న పని కాదని.. సత్వరం ఈ నిధి మొదలవుతుందని, దీనికి అవసరమైన మొత్తంలో సగం డబ్బులు తాను వ్యక్తిగతంగా ఇస్తానని, మిగతాది జనసేన నాయకులు ఇస్తామని తనకు హామీ ఇచ్చారని పవన్ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించాడు. ఈ విషయంలో పవన్‌ను ఎంత అభినందించినా తక్కువే.
Gulte Telugu Telugu Political and Movie News Updates