జ‌న‌సేన దూర‌దృష్టి కోల్పోతోందా?  గ్రౌండ్ టాక్‌

ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. వైసీపీ కొమ్ములు విరిచేస్తామ‌ని.. ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే.. ఒక పార్టీ అధికారంలోకి రావ‌డం అంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో తేలికేమీ కాదు. ఏదో నాలుగు డైలాగులు.. ప‌ది విమ‌ర్శ‌లు చేసేసి.. ప్ర‌జ‌ల దృష్టిని మళ్లించే ప్ర‌య‌త్నం చేసే ప‌రిస్థితి ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఏమాట‌కు ఆమాట చెప్పాలంటే.. నిత్యం ప్ర‌జ‌ల్లో అయినా.. ఉండాల‌.. లేదా.. చేతినిండా డ‌బ్బులైనా పంచాలి. ఈ రెండు వ్యూహాల‌ను మించిన రాజ‌కీయం లేదు. మ‌రి జ‌న‌సేన రెండో దానికి వ్య‌తిరేకం. కాబ‌ట్టి మొద‌టిదైనా చేయాలి క‌దా! అనేది.. జ‌న‌సేన‌లోనే.. త‌ట‌స్థ‌ నాయ‌కులు చెబుతున్న మాట‌. 2019 ఎన్నిక‌ల కు ముందు రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అనంత‌ర కాలంలో మొక్కుబ‌డిగా రాష్ట్రానికి వ‌స్తున్నార‌ని. జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య గుసగుస వినిపిస్తోంది. వ‌చ్చినా.. కొన్ని కొన్ని కార్య‌క్ర‌మాల కు ప‌రిమితం అవుతున్నారు.

దీంతో అనుకున్న విధంగా పార్టీకి మైలేజీ రావ‌డం లేద‌ని చెబుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు.. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని సంక‌ల్పం చెప్పుకోవ‌డం.. మ‌ళ్లీ త‌ర్వాత‌.. మ‌రిచిపోవ‌డం.. వంటివి పార్టీకి మామూలు అయిపోయాయ‌ని.. అంటున్నారు. నిజానికి గ‌త ఏడాది అక్టోబ‌రు 2న మ‌హాత్మా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ర‌హ దారుల ఉద్య‌మాన్ని చేప‌ట్టారు. ఏపీలో ఉన్న రోడ్లపై గోతుల‌ను పూడ్చే శ్ర‌మ‌దానం కార్య‌క్రమాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి కూడా విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఈ కార్యక్ర‌మం త‌ర్వాత‌కూడా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

అంతేకాదు. మ‌రిన్ని ప్ర‌జాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఈ త‌ర‌హాలో ప్ర‌జ‌ల ను క‌ద‌లించే.. ప్ర‌జ‌ల‌ను న‌డిపించే కార్య‌క్ర‌మాలు ఎక్క‌డా చేప‌ట్ట‌డంలేదు. పోనీ.. రాష్ట్రంలో స‌మ‌స్య‌లు లేవా? అంటే.. చాలానే ఉన్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న ప‌రిస్థితి లేదు. మ‌రి ఇలా అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా నెగ్గుకు వ‌చ్చేది? అనేది కీల‌కంగా మారిన ప్ర‌శ్న‌. ఇదే విష‌యంపై.. నాయ‌కులు కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ప‌వ‌న్ ఈ విష‌యంలో సీరియ‌స్‌గా స్పందించాల‌ని కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.