జనసేన పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఇటీవల పార్టీ తొమ్మిదో వార్షికోత్సవ ఆవిర్భావ సభ జరిగింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసిన జనసేనకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ మధ్య కాలంలో రాజకీయంగా కాస్త ఎదిగిన పార్టీని వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాల దిశగా నడిపించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు.
2024 ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆయన పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం సొంత ప్రయోజనాలను పక్కనపెట్టే పార్టీలతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. మరోవైపు తన పొలిటికల్ కెరీర్‌పైనా ఆయన దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఒక స్థానంలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది.
ఆ ఓటములతో..
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది. పొత్తుల విషయాన్ని పక్కనపెడితే ఆయన ఈ సారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకు తూర్పు గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలను పవన్ ఎంచుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాపు సామాజికవర్గం బలంగా ఉన్నా తూర్పు గోదావరిలో ఓ నియోజకవర్గం నుంచి పోట చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పవన్ భావిస్తున్నారని టాక్. మరోవైపు ఇక్కడ జనసేన క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. అందుకే కాకినాడ రూరల్ లేదా పిఠాపురం నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.
సురక్షితమని భావించి..
2009లో ఏర్పడిన కాకినాడ నియోజకవర్గంలో ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అక్కడ గెలిచింది. ప్రజారాజ్యం తరపున కన్నబాబు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పవన్ మద్దతుతో టీడీపీ కూటమి అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి కన్నబాబు మరోసారి నెగ్గారు. ఇక పిఠాపురంలో 2009లో ప్రజారాజ్యం నుంచి వంగా గీత, 2014లో టీడీపీ అభ్యర్థి ఎస్‌వీఎస్ఎన్ శర్మ నెగ్గారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి దొరబాబు గెలిచారు. ఈ నియోజకవర్గాల్లో కాపు బలం ఎక్కువగా ఉంది. అందుకే చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం నేతలు ఇక్కడ గతంలో విజయాలు సాధించారు. ముఖ్యంగా పిఠాపురం అయితే తనకు సురక్షితమని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఆయన చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates