రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి ప్రారంభంలోనే ఒక పెద్ద వివాదం తెరమీదికి వచ్చింది. తర్వా త.. పెను సంచలన ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ రెండు పరిణామాలు కూడా రాజకీయంగా అందరికీ అవకాశం కల్పించినవే. పాజిటివా.. నెగిటివా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. స్పందించే సమయం అయితే వచ్చింది. అటు కమ్యూనిస్టుల నుంచి ఇటు బీజేపీ నేతల వరకు ఈ రెండు విషయాలను రాజకీయంగా వాడుకుంటున్నాయి.
అవే.. ఒకటి సంక్రాంతి నేపథ్యంలో గుడివాడలో నిర్వహించారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్న క్యాసినో వ్యవహారం. రెండు ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలను వ్యవస్థీకరిస్తూ.. ప్రకటన చేసింది. అయితే.. ఈ రెండు విషయాలపై ఇతర పార్టీలు స్పందించినా.. ఒక్క గుడివాడ అంశంపై కొన్ని పక్షాలు యాగీ చేసినా.. జిల్లాల విభజనపై స్పందించినా.. కీలకమైన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్న జనసేన పార్టీ మాత్రం ఈ అంశాలపై పెద్దగా రియాక్ట్ కాలేదు.
జిల్లాల విషయంపై అసలు స్పందించనే లేదు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు మౌనంగా ఉంది? అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమవుతుందని.. ప్రజలకు మరింత చేరువగా పాలన చేరుతుందని.. సర్కారు చెబుతోంది. ఈ క్రమంలోనే మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ.. ప్రకటన జారీ చేసింది. అంతేకాదు.. కొత్తగా ఏర్పడిన వాటిలో.. రెండు జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పేర్లను పెట్టింది.
అయితే, ఏపీ ప్రభుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై సొంత పార్టీలోనే మిశ్రమ స్పందన వస్తోంది. ఇక, టీడీపీ కూడా ఆచి తూచి అడుగులు వేస్తోంది. కక్కలేక మింగలేకఅన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టడాన్ని స్వాగతిస్తోంది. ఇక, అదేసమయంలో ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేసి.. ఆయన పేరు పెడతారా? అంటూ.. నిలదీసింది. మరి.. ఈ విషయంలో జనసేన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇన్ని జిల్లాలు ఎందుకు? అని కానీ, లేదా.. మరిన్ని జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టాలని కానీ.. నాయకులు వ్యాఖ్యానించలేదు.
పోనీ.. సర్కారు నిర్ణయం బాగుంటే.. బాగుందనైనా వ్యాఖ్యానించాలి. అలా కూడా స్పందించలేదు. సో.. మొత్తానికి ప్రజల మధ్య ఉంటాం.. ప్రజల సమస్యలు వింటాం.. అనే నాయకులు ఇలా.. కీలక విషయాల్లో.. జనసేన మౌనంపై సర్వత్రా విమర్శలు వస్తుండడం గమనార్హం. మరి పవన్ ఎప్పుడు స్పందిస్తారో.. ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.