మెల్లిగా దిగొస్తున్న మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెల్లి మెల్లిగా దిగొస్తున్నారు. గడచిన ఏడాదిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న రైతుల డిమాండ్లకు మోడి తలొంచుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఢిల్లీ శివార్లలో ఉద్యమం ప్రారంభమైంది. ముందు పంజాబ్ లో మొదలైన ఆందోళన తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత హర్యానాకు పాకింది.

మూడు రాష్ట్రాల్లో ఆందోళనలే చివరకు పెద్ద ఉద్యమంగా మారి ఢిల్లీని ఒక ఊపు ఊపేసింది. రాజకీయంగా బీజేపీకి తగిలిన అనేక ఎదురుదెబ్బలే కాకుండా తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని మోడి హఠాత్తుగా వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత రైతులు మరికొన్ని డిమాండ్లు చేశారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో వ్యవసాయ సంస్కరణల బిల్లును రద్దు చేయటంతో పాటు కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేసి కేసు పెట్టి విచారణ జరపాలని డిమాండ్లు చేస్తున్నారు. వీటిలో కనీస మద్దతు ధర చట్టానికి రూపునిచ్చేందుకు కేంద్రం ఒక కమిటిని నియమించింది. ఈ కమిటిలో సభ్యులను సిఫారసు చేయాలని రైతు సంఘాలను కేంద్రం కోరింది. కనీస మద్దతు ధర చట్టం రూపకల్పనకు కమిటి అంటే మోడి రైతు సంఘాల ఒత్తిళ్ళకు లొంగుతున్నట్లే అనుకోవాలి. ఇపుడు గనుక రైతుల డిమాండ్లలో కొన్నైనా నెరవేర్చకపోతే రాబోయే యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో దెబ్బ పడటం ఖాయమని అర్ధమైపోయినట్లుంది.

అందుకనే రైతు సంఘాలను మంచి చేసుకునేందుకు మెల్లిగా వాళ్ళ డిమాండ్లకు మోడి తలొంచుతున్నారు. ఎంతకాలం ఉద్యమం చేసినా పట్టించుకునేదే లేదని తెగేసి చెప్పిన ఇదే కేంద్ర ప్రభుత్వం ఒక్కో మెట్టు దిగుతోందంటే అదంతా ఎన్నికల్లో ఓటమి భయమే అని అందరికీ అర్ధమైపోతోంది. వ్యవసాయ చట్టాలు ముఖ్యమా లేకపోతే యూపీలో గెలుపు ముఖ్యమా అని చూసుకుంటే మోడి యూపీ ఎన్నికల్లో గెలుపువైపే మొగ్గారు.

తెలివైన వాళ్ళు ఎవరైనా ఇదే పనిచేస్తారనటంలో సందేహంలేదు. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిపోయిందంటే అంతే సంగతులు. దీని ప్రభావం రాబోయే పార్లమెంటు ఎన్నికలపై పడుతుంది. నిజంగానే యూపీ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడితే బీజేపీ అధికారంలోకి వచ్చేది కష్టమే. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని మోడి ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. రేపు భాగస్వామ్య పార్టీల బలంతోనే ప్రభుత్వాన్ని నడపాల్సొచ్చినా లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా బలం లేకపోయినా బీజేపీకి చాలా ఇబ్బందే. మరి అవసరం కోసం ఇన్ని మెట్లు దిగుతున్న బీజేపీని రైతులు ఆదరిస్తారా..ఏమో డౌటే.