ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి పార్టీని అధికారంలోకి తేవడానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. అధికార వైసీపీ పార్టీని సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీని గెలిపించడానికి బాబు అన్ని రకాలుగా కష్టపడుతున్నా పార్టీలోని కొంతమంది నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది. అందులో ముఖ్యంగా గల్లా కుటుంబం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనలేకపోతుండడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గల్లా జయదేవ్ వరుసగా రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. బాబుకు ఆయనతో మంచి అనుబంధమే ఉంది. కానీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ జయదేవ్ ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నట్లు కనిపించరు. ఎక్కువగా వ్యాపారాలకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకులకే ఆయన అందుబాటులో ఉండడం లేదని గుంటూరు టీడీపీ నాయకులు గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో జయదేవ్ ఒకరు కావడంతో బాబు ఆయన్ని ఏమీ అనలేకపోతున్నారని సమాచారం.
జయదేవ్ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. ఇప్పుడాయన తనయుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా బాబు 36 గంటల దీక్ష చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ ఆ దీక్షలోనూ ఢిల్లీ పర్యటనలోనూ జయదేవ్ ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ జయదేవ్ బిజీగా ఉన్నారు అనకుంటే ఆయన తల్లి గల్లా అరుణకుమారి కచ్చితంగా బాబు దీక్షకు వచ్చేవారు. కానీ ఆమె కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
బాబు చిత్తురూ జిల్లా వచ్చినా అరుణకుమారి ఆయన్ని కలిసే ప్రయత్నం చేయలేదు. దీంతో టీడీపీలో అసలు గల్లా కుటుంబం ఉందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జయదేవ్ పార్టీ తరపున పోటీ చేస్తారా? అన్నది కూడా సందేహంగానే మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. వ్యాపారాల కారణంగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates