వైసీపీపై గ‌ర్జించిన ప‌వ‌న్‌… పంచ్‌లు అంటే ఇవే…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీపై తీవ్ర‌స్థాయిలో గ‌ర్జించారు. గ‌త వారం రోజులుగా ప‌వ‌న్ ఓ సినీ ఫంక్ష‌న్లో ఏపీ ప్ర‌భుత్వంతో పాటు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం.. త‌ర్వాత వైసీపీ మంత్రులు, నేత‌ల‌తో పాటు పోసాని లాంటి వాళ్లు ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డం ఇదంతా ఓ ప్ర‌హ‌స‌నంలా న‌డుస్తూ వ‌స్తోంది. ఇక ఈ రోజు మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో విలేక‌ర్ల‌తో మాట్లాడిన ప‌వ‌న్ ప్ర‌సంగం ఆరంభం నుంచే వైసీపీని టార్గెట్‌గా చేసుకుని ప‌దునైన పంచ్‌లతో విరుచుకు పడిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే ప‌వ‌న్ ప్ర‌సంగం ఆద్యంత చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా సాగింది.

ప‌వ‌న్ మాట్లాడుతూ గ్రామ‌సింహాలు అంటే అడ‌వి సింహాలు కాద‌న్న విష‌యాన్ని వైసీపీ నేత‌లు తెలుసుకోవాల‌ని చెప్పారు. వైసీసీలో ఉన్న స‌న్నాసుల‌కు త‌ల్లిదండ్రులు నేర్ప‌ని సంస్కారాన్ని తానే నేర్పిస్తాన‌ని. ఆ పార్టీ నేత‌ల‌కు భ‌యం అంటే ఏంటో చూపిస్తాన‌ని ప‌వ‌న్ స‌వాల్ చేశారు. త‌న‌ను అనాల్సిన అన్ని మాట‌లు అనేసి కులాల చాటున న‌క్కుతోన్న నాయ‌కుల‌ను టైం వ‌చ్చిన‌ప్పుడు బ‌య‌ట‌కు లాక్కొచ్చి మ‌రీ కొడ‌తాం అని వార్నింగ్ ఇచ్చారు. బాప‌ట్ల‌లో పుట్టిన త‌న‌కు కూడా బూతులు వ‌చ్చ‌ని.. తాను నాలుగు భాష‌లు మాట్లాడ‌తాన‌ని.. వైసీపీ నేత‌ల‌ను ఏ స్టైల్లో తిట్టాలో చెపితే అలాగే తిడ‌తాన‌ని చెప్పారు.

ముఖ్య‌మంత్రి చిన్నాన‌ను ఎవ‌రు చంపార‌ని ప్ర‌శ్నిస్తే.. నా మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించిన ప‌వ‌ర్ ఎయిర్ పోర్ట్‌లో కోడి క‌త్తి గురించి అడిగినా కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాను ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలోనే ముందుకు వెళ్లాల‌ని అనుకుంటున్నాన‌ని.. చివ‌ర‌కు వైసీపీ అధినేత సైతం త‌న కుటుంబం, వ్య‌క్తిగ‌త అంశాల గురించి మాట్లాడార‌ని.. కానీ తాను మాత్రం వైసీపీ నాయ‌కుల ఇంట్లో ఆడ‌వాళ్ల‌కు మాట ఇస్తున్నాన‌ని.. వారి గురించి మాత్రం తాను ఎప్పుడూ మాట్లాడ‌న‌ని ప‌వ‌న్ చెప్పారు.

మా నాన్న కానిస్టేబుల్ మాత్ర‌మే అని.. ఆయ‌న తెగువ ధైర్యం ఇచ్చార‌ని.. ఆయ‌న నాకు ప‌ద‌వులు , ఆస్తులు ఇవ్వ‌డానికి ముఖ్య‌మంత్రి కాద‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ, బీజేపీకి తాను ఎందుకు మ‌ద్ద‌తు ఇచ్చానో గ‌తంలోనే చెప్పాన‌న్న ప‌వ‌న్‌.. త‌న‌కు ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యాన‌ని. రాజ‌కీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వ‌చ్చాన‌ని ఇక్క‌డ క‌లుపు మొక్క‌ల‌ను ఏరిపార‌వేస్తాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

వైసీపీ నేత‌ల‌ను ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దా ? సినిమా టిక్కెట్ల గురించి అడిగితే త‌న‌ను ఎందుకు తిడుతున్నార‌ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ త‌న‌తో పెట్టుకుంటే తోలు తీస్తాన‌ని గ‌ర్జించారు. మా క‌ష్టార్జితాన్ని దోచుకునే హ‌క్కు ఎవ్వ‌రికి లేద‌ని.. నాకు థియేట‌ర్లు కూడా లేవ‌ని.. మీ భార‌తి సిమెంట్‌ను ఉచితంగా పంచుతారా ? అని ప్ర‌శ్నించారు. ఏపీలో పాడైపోయిన రోడ్లు పోయ‌మ‌ని అడిగినా కూడా వైసీపీ వాళ్లు బూతులు తిట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఏదేమైనా ప‌వ‌న్ ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేద‌నే ఆయ‌న ప్ర‌సంగం చెపుతోంది.