ప్రతిపక్షాలకు బీజేపీ బుద్ధులు చెబుతోందా ?

‘సభను మార్కెట్లాగ మార్చేద్దామా’ ? ఇది తాజాగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులను ఉద్దేశించి సంధించిన ప్రశ్న. గడచిన 12 రోజులుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన ఎంపిలు ఒకవైపు లోక్ సభలోను అలాగే ఇటు రాజ్యసభలో కూడా పెగాసస్ ఆరోపణలపై విచారణ చేయాలని, ప్రధానమంత్రి సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే వీళ్ళ డిమాండ్ ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఉభయసభల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. శుక్రవారం రాజ్యసభను వాయిదా వేసేసమయంలో సభ్యుల గోలను ఉద్దేశించి ఛైర్మన్ వెంకయ్యనాయుడు పై వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదు. కానీ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు సభలో ఎలా వ్యవహరించిందనే విషయాన్ని మరచిపోయినట్లుంది.

యూపీఏ-2 ప్రభుత్వంలో 2 జీ స్పెక్ట్రమ్ వేలంపాటలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో కాగ్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా బీజేపీ సభ్యులు ఉభయసభల్లోను గోల మొదలుపెట్టారు. 2జీ స్పెక్ట్రమ్ లో అవినీతి జరగలేదని, కాగ్ నివేదికంతా తప్పులే అని అప్పట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎంత మొత్తుకున్నా బీజేపీ వినిపించుకోలేదు. ఇలాగే సుమారు 20 రోజులపాటు ఉభయసభల్లో గందరగోళం సృష్టించింది. చివరకు సుప్రింకోర్టులో కేసు కూడా వేశారు. ఇదే అంశంలో ప్రభుత్వం అప్పట్లో ఇద్దరు మంత్రులను, ఇద్దరు ఎంపిలపై కేసులు పెట్టి అరెస్టు కూడా చేసింది. చివరకు సుప్రింకోర్టులో జరిగిన విచారణలో స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతే జరగలేదని తేలింది.

అంతకుముందు కూడా రక్షణరంగంలో కుంభకోణం జరిగిందంటు బీజేపీ ఎంపీలు నానా గోలచేశారు. అప్పుడు కూడా దాదాపు 40 రోజుల పాటు ఉభయసభలను సాగనీయలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే పార్లమెంటులో నానా గోల చేస్తుంది. అదే అధికారంలో ఉంటేమాత్రం పార్లమెంటు నిర్వహణపై ప్రతిపక్షాలకు బుద్ధులు చెబుతుంది. దీనికి వెంకయ్య కూడా మినహాయింపుకాదు. ఎందుకంటే దశాబ్దాలుగా రాజ్యసభ ఎంపిగా మాత్రమే కంటిన్యు అవుతున్న వెంకయ్య కూడా రాజ్యసభలో గోల చేసిన వ్యక్తే. మొత్తానికి బీజేపీ చరిత్రను మరచిపోయినట్లే ఉంది చూస్తుంటే.