రచ్చరచ్చవుతున్న ట్యాపింగ్ దుమారం

దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై దుమారం పెరిగిపోతోంది. 300 మంది ప్రముఖుల ఫోన్లను ఇజాయెల్ కు చెందిన ఎన్ఒఎస్ సంస్ధ ద్వారా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు సోమవారం కథనాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కథనం ప్రకారం రాహూల్, ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు అశ్విన్ వైష్ణవ, ప్రహ్లాద్ సింగ్ పాటిల్ తో పాటు ప్రతిపక్ష నేతలు, 40 మంది జర్నలిస్టులు, ఓ జడ్జీ లాంటి అనేకమంది ఫోన్లు ట్యాప్ అయ్యింది.

దివైర్ లో వచ్చిన కథనం సరిగ్గా పార్లమెంటు సమావేశాల మొదటిరోజే కావటంతో సమావేశాల్లో మంటలు రేగింది. రోజంతా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైనే ప్రతిపక్షాలు గోల గోల చేశాయి. సరే ప్రభుత్వం ఎలాగూ ఫోన్ ట్యాపింగ్ కథనం తప్పుల తడకగా కొట్టేసింది. ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయించటం లేదని ప్రకటించింది. అయినా ప్రతిపక్షాలు పట్టించుకోవటంలేదు.

ఎందుకంటే ఒకవైపు ఉభయసభల్లో ట్యాపింగ్ పై రచ్చ జరుగుతుంగగానే వాషింగ్టన్ పోస్టు కూడా ది వైర్ కథనాన్ని దృవీకరిస్తు మరో కథనాన్ని ఇవ్వటమే. నిజానికి ప్రభుత్వంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి ఉన్నా ప్రతిపక్షాలపై నిఘా ఉంచటం కొత్తేమీకాదు. ప్రభుత్వాన్ని రక్షించుకోవటం కోసం అనుమానం ఉన్న వ్యక్తులు, సంస్ధలు, ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే లక్ష్యంతో ఎవరెరవరు ఏమేమి చేస్తున్నారనే విషయంలో ప్రభుత్వం నిఘా ఉంచుతుందనటంలో సందేహం లేదు.

కాకపోతే నిఘా జాబితాలోని ప్రముఖుల పేర్లు లీకైనపుడు ఇలాంటి రచ్చలు జరుగుతుంటాయి. గతంలో రాజీవ్ గాంధి, మన్మోహన్ సింగ్ హయాంలో కూడా బీజేపీ ఇలాంటి రచ్చే చేసింది. అధికారంలో ఉన్నపార్టీకి ప్రతిపక్షాలకు ఇలాంటి వివాదాలు సాధారణమే. కాకపోతే ఇపుడు ప్రతిపక్షంలోని ప్రముఖులు, వైరాలజీ సైంటిస్టులు, జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టుల పేర్లు లీకవ్వటంతో సమస్య కాస్త పెద్దదిగా కనబడుతోందంతే. మరి ఇపుడు రేగిన దుమారం ఎప్పుడు చల్లారుతుందో చూడాల్సిందే.