చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ జంట. చైతూకు అది రెండో వివాహ కావడం, అప్పటి పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియాలో తమ పెళ్లి గురించి ఎక్కువ చర్చ లేకుండా చూసుకున్నారు చైతూ, శోభిత. పెళ్లి తంతు పూర్తి చేశాక కొన్ని ఫొటోలను రిలీజ్ చేయడంతో సరిపెట్టారు. ఐతే ఇప్పుడు తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లికి సంబంధించి ఒక మెస్మరైజింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. తమ పెళ్లిని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చైతూ-శోభిత ఎంతో సంబరంగా జరుపుకున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వివాహం సందర్భంగా వీళ్లిద్దరూ చేసిన అల్లరి.. నాగ్ అండ్ కో సంతోషాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

పెళ్లి విషయమై శోభిత, చైతూ వీడియో బైట్స్ కూడా ఇచ్చారిందులో. తమ జీవిత భాగస్వామి గురించి శోభిత, చైతూ చెప్పుకున్న తీరు కూడా చాలా బాగుంది. ఇంకొకరు వచ్చి తమ జీవితాల్లో ఖాళీలు పూరించాల్సిన అవసరం లేదని.. తాము వ్యక్తులుగా అప్పటికే సంపూర్ణం అని.. కానీ చైతూ లేకపోతే తన జీవితంలో ఏదో వెళితిగా ఉంటుందని శోభిత చెప్పింది. ఇక శోభిత గురించి చైతూ మాట్లాడుతూ.. ఆమె తన సొంతం అన్నపుడు కలిగిన ఫీలింగ్ చాలా గొప్పదని, తను తోడుంటే ఏదైనా సాధించగలనని అనిపిస్తుందని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉండగా చైతూ-శోభితలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. దర్శకుడు చందూ మొండేటి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుండడం గమనార్హం. ‘‘నిశ్శబ్దాన్ని మించిన శబ్దం లేదు. ఈ విషయంలో మీరు గొప్ప ఉదాహరణ శోభిత అక్కినేని’’ అంటూ చైతూ-శోభితల పెళ్లి ఫొటోకు వ్యాఖ్య జోడించాడు చందూ. చైతూతో మూడు సినిమాలు (ప్రేమం, సవ్యసాచి, తండేల్) చేసిన చందూకు అతడితో మంచి అనుబంధం ఉంది. శోభితకు కూడా అతను క్లోజే. గత ఏడాది చైతూ, శోభితల పెళ్లి జరిగినపుడు సమంత అభిమానులు వాళ్లిద్దరినీ టార్గెట్ చేశారు. ముఖ్యంగా శోభితను ఎటాక్ చేశారు. కానీ అప్పుడు ఆమె ఏమీ స్పందించకుండా సైలెంట్‌గా ఉంది. ఇటీవలే సమంత పెళ్లి జరగడంతో శోభిత మీద నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే చందూ ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది.