ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్ అని అన్నారు. చంద్రబాబు విజన్‌కు తగ్గట్లు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని.. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
పవన్‌కల్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశా అని వెంకటరెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి.. అదే స్నేహం కొనసాగాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై.. వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల కాదని హెచ్చరించారు. చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడంటూ కితాబునిచ్చిన కోమటిరెడ్డి…. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశా అంటూ ఆయన ఈరోజు వివరణ ఇచ్చారు. దీంతో ఆ వివాదానికి తెరపడినట్లు అయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కోమటిరెడ్డి కలుస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన సీఎం చంద్రబాబును మాత్రం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates