వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు. వారు వేసే అడుగులు చేసే పనులే వారిని వెనక్కి నెడతాయి లేదా ముందుకు తీసుకువెళ్తాయి. రాజకీలాల్లో స్వయంకృత తప్పులు నాయకులకు ఇబ్బందిగా మారుతాయి. ఈ విషయంలో వైసీపీ అధినేత తనను తానే డైల్యూట్ చేసుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
వాస్తవానికి ఏ పార్టీ అయినా పుంజుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. కానీ వైసీపీలో ఆలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలంతా ఒక వైపు ఉంటే వైసీపీ మరో బాటలో ప్రయాణిస్తోంది. తాజాగా జగన్ ప్రస్తావించిన అంశాల్లో ప్రజా కోణం కనిపించకపోగా మరింత బలంగా తన తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. వీటిని ప్రజలు ఏవగించుకుంటున్నారన్న స్పృహ కూడా కనిపించడం లేదు.
తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి వినియోగించారన్నది వాస్తవమని సీబీఐ తేల్చి చెప్పింది. నెల్లూరు కోర్టుకు సీబీఐ అందించిన రిపోర్టులో ఇది స్పష్టంగా ఉందని మీడియా పేర్కొంది. అయినప్పటికీ జగన్ మాత్రం ఎక్కడా కల్తీ జరగలేదని వాదించారు. నిజానికి తప్పు జరిగినప్పుడు దానిని ఒప్పుకోవడం ప్రజలకు సంజాయిషీ ఇవ్వడం ద్వారా వారి అభిమానాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కానీ జగన్ వైఖరిలో మార్పు రాలేదు.
పరకామణి కేసులోనూ ఇదే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవారి నగదును కొట్టేయడమే తప్పని ప్రజలు భావిస్తుంటే జగన్ దీనిని లైట్ తీసుకున్నారు. ఇది మైనస్ కాదా అనేది వైసీపీలోనే నాయకులు చర్చించుకుంటున్నారు. పైగా దీనిని సమర్థించుకుంటూ రాజకీయ కారణంగానే దీనిని పెద్దది చేశారన్న వివరణ ఇవ్వడం మరొక విడ్డూరం.
అంతేకాదు తమ పాలనకు తానే సర్టిఫికెట్ ఇవ్వడం జగన్ చేస్తున్న మరో తప్పు. అమరావతి రాజధాని నుంచి రైతుల దాకా వైసీపీ హయాంలో తప్పులు జరిగాయి. భవిష్యత్తులోనూ ఇలానే ఉంటారా అన్న సందేహాలు ముసురుకున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని జరగకుండా చూస్తామని చెప్పాల్సిన జగన్ సమర్థించుకోవడం తమ పాలనకు మార్కులు వేసుకోవడం ద్వారా వైసీపీ గ్రాఫ్‌ను ఆయనే తగ్గించుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ మరొక మూడు సంవత్సరాలు ఇలాగే ఉండాలని టీడీపీ నాయకులు చమత్కరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates