బెస్ట్ ఫ్రెండ్‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ షాక్ ఇస్తారా…!


గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి. వైసీపీలో త్యాగాలు చేసిన నాయ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. జ‌గ‌న్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న పార్టీకోసం ఎంతో శ్ర‌మించారు. జ‌గ‌న్ సోనియాగాంధీని క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న వెంట ఉన్న తొలి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డే. అప్పుడే ఆయ‌న జ‌గ‌న్‌తో క‌లిసి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక 2014 త‌ర్వాత ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ నుంచి వ‌చ్చిన ఆహ్వానాల‌ను కూడా కాద‌ని.. ఆయ‌న వైసీపీలోనే ఉండిపోయారు. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో క‌డ‌ప‌లో ఆయ‌న కూడా సంఘీభావ పాద‌యాత్ర చేశారు. జ‌గ‌న్ సీఎం అయ్యేందుకు పొరుగు జిల్లాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని సంఘ‌టిత ప‌రిచారు. ఈ క్ర‌మంలో వైసీపీ త‌ర‌ఫున మంచి వాయిస్ కూడా వినిపించారు.

దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే గ‌డికోట‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌ని.. ఆయ‌న వ‌ర్గం భావించింది. కానీ, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డమే ఆయ‌న‌కు ఇబ్బందులు వ‌చ్చేలా చేసింద‌ని అంటారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే గ‌డికోట‌కు ప్ర‌భుత్వ చీఫ్ విప్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అయితే.. ఆయ‌న మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌క‌పోవ‌డంపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. త‌న‌కు త‌గిన ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని.. దీంతో జిల్లాలో త‌లెత్తుకుని తిర‌గ‌లేక‌పోతున్నాన‌ని.. ఆయ‌న త‌న అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల వ‌ద్ద త‌ర‌చుగా వాపోతున్నారు. పైగా జిల్లాలో క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ‌వానే ఎక్కువైపోయింది.

ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నున్నందున ఇప్ప‌టికైనా త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని.. గ‌డికోట భావిస్తున్నారు. దీనిపై ఆయ‌న అనుచ‌రులు కూడా భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లాలో ఒక్క మైనార్టీ నాయ‌కుడికి త‌ప్ప మంత్రి ప‌ద‌విని ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. సో.. ఈ క్ర‌మంలో త‌న‌కు ఖ‌చ్చితంగా అవ‌కాశం చిక్కుతుంద‌నేది గ‌డికోట ఆశ‌లు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో సీఎం జ‌గ‌న్ వ్యూహం వేరేగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సామాజిక కోణంలోనే త‌ను ప్ర‌చారానికి దిగి.. ఓట్లు ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌డ‌ప జిల్లాలో తాను రెడ్డి వ‌ర్గం నుంచి ఏకంగా ముఖ్య‌మంత్రిగా ఉండ‌డంతో మ‌రో రెడ్డి నేత‌కు ప‌ద‌వి ఇవ్వ‌రనే అంటున్నారు. అదే జ‌రిగితే శ్రీకాంత్ రెడ్డికి మ‌రోసారి నిరాశ త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఆయ‌న విప్‌గా ఉండ‌డంతో ఆయ‌న్ను ఇంకెలా శాంత ప‌రుస్తారో ? చూడాలి.