మళ్ళీ ఉపఎన్నికలు తప్పవా ?

పశ్చిమబెంగాల్ రాజకీయాలను ఫాలో అవుతున్న వాళ్ళకు ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉపఎన్నికలంటే రాష్ట్రంమొత్తం కాకపోయినా కనీసం ఓ 30 నియోజకవర్గాల్లో తప్పేలా లేవని అనుకుంటున్నారు. ఇందుకు కారణాలు ఏమిటంటే పార్టీ ఫిరాయింపులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మొన్నటి ఎన్నికల్లో మమతాబెనర్జీ మూడోసారి గెలవగానే బీజేపీలో లుకలుకలు మొదలైపోయాయి.

ఇప్పటి రాజకీయాలు ఎలాగుంటున్నాయంటే అధికారం లేనిదే ఎంఎల్ఏలు, ఎంపిలు ఉండలేకపోతున్నారు. అంటే అచ్చంగా రాజకీయాలు మాత్రమే చేసే కొందరిని వదిలేస్తే చాలామంది ప్రజాప్రతినిధులు రాజకీయాలతో పాటు ఎన్నో వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. అధికారపార్టీల్లో కాకుండా ప్రతిపక్షంలో ఉంటే ఏదో ఓ కారణంతో వేధింపులు తప్పటంలేదు.

అందుకనే వీలున్నంతలో చాలామంది అధికారపార్టీల్లో ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ బెంగాల్ ప్రత్యేక పరిస్ధితులు ఏమిటంటే ఎన్నికలకు ముందు ముకుల్ రాయ్ అనే సీనియర్ నేతతో పాటు 29 మంది తృణమూల్ ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు+కొందరు సీనియర్ నేతలను బీజేపీలో లాగేసుకున్నది. ఎలాగూ ఎన్నికల ముందు జరిగిన ఫిరాయింపులే కాబట్టి తృణమూల్ కూడా ఆ ఎంఎల్ఏలపై అనర్హత వేటుపై ఆసక్తి చూపలేదు.

అయితే నరేంద్రమోడి, అమిత్ షాతో పాటు చాలామంది అంచనాలు తల్లక్రిందులైపోయింది. ఘోరంగా ఓడిపోతుందని అనుకున్న మమత అఖండ మెజారిటితో హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నది. దాంతో బీజేపీ తరపున గెలిచన 74 మంది ఎంఎల్ఏల్లో కొందరు ఎలాగైనా తృణమూల్లో చేరిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బీజేపీ ఎంఎల్ఏ ముకుల్ రాయ తృణమూల్లో చేరిపోవటంతో మరికొందరు ఎంఎల్ఏలకు ఊతమిచ్చినట్లయ్యింది.

దాంతో సుమారు 25 మంది ఎంఎల్ఏలు బీజేపీని వదిలేసి తృణమూల్లో చేరిపోవటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. వీళ్ళందరు ముకుల్ మద్దతుదారులేనట. పైగా బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారితో టచ్ లో లేరట. మమత మీద ఫిర్యాదు చేయటానికి సువేందు ఎంఎల్ఏలతో గవర్నర్ ను కలిశారు. ఆ భేటీకి 27 మంది ఎంఎల్ఏలు గైర్హాజరయ్యారట. కాబట్టి తొందరలోనే వీళ్ళంతా బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది.

బీజేపీలో గెలిచి తృణమూల్లో చేరితే బీజేపీ ఊరుకుంటుందా ? ఏదో రూపంలో వీళ్ళపై అనర్హత వేటు పడేట్లు చేస్తుంది. అసెంబ్లీ స్పీకర్ ద్వారా కాకపోతే గవర్నర్ ద్వారానో అదీ కుదరకపోతే కోర్టుల ద్వారానో అనర్హత వేటుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయాలు ఎంఎల్ఏలకు కూడా తెలుసు. అందుకనే ఉపఎన్నికలకు రెడీ అవుతున్నారట. కాబట్టి బెంగాల్లో తొందరలోనే కొన్ని నియోజకవర్గాలకు ఉపఎన్నికలు తప్పవనే సంకేతాలు కనబడతున్నాయి.