ఆమధ్య వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడును ఉద్దేశించి ట్వీట్ పెట్టినా జూలై 23వ తేదీన ఏమి జరగబోతోందో చూడమంటు సస్పెన్సులో పడేశారు విజయసాయిరెడ్డి. అయితే విశాఖపట్నంలో ఆయన చేసిన ప్రకటన చూసిన తర్వాత జూలై 23వ తేదీకి వైజాగ్ పాలనా రాజధానిగా మారబోతోందా ? అనే సందేహాలు మొదలయ్యాయి.
విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం రోజున అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి మారిపోతుందేమో అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఎందుకంటే తొందరలోనే పరిపాలనా రాజధాని అమరావతి నుండి వైజాగ్ కు మారిపోతోందని ఎంపి తాజాగా ప్రకటించారు. సీఆర్డీఏ చట్టంపై కోర్టుల్లో విచారణకు రాజధాని తరలింపుకు సంబంధమే లేదని తేల్చేశారు.
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధానిగా ఉంటుందని ఎంపి స్పష్టంచేశారు. గతంలో చంద్రబాబునాయుడు కూడా హైదరాబాద్ లో కూర్చునే పరిపాలించిన విషయాన్ని గుర్తుచేశారు. సో విజయసాయి తాజా ప్రకటన చూస్తుంటే తొందరలోనే పరిపాలనా రాజధాని విశాఖకు మారిపోవటం తథ్యమన్న విషయం అర్ధమైపోతోంది. ఇందుకోసమే వైజాగ్ లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయట.
రుషికొండ, భీమిలీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రెసిడెన్స్ తో పాటు మంత్రుల క్యాంపు కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు తదితరాలకు అవసరమైన భవనాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఆఫీసులు, రెసిడెన్స్ భవనాలు అవసరానికి మించే ఉన్నాయని కాకపోతే వాటిని కాస్త అవసరాలకు తగ్గట్లు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుందని అధికారయంత్రాంగం భావించిందట. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవసరమైనట్లుగా వాస్తు తదితర మార్పులు చేర్పులు చేసిన వెంటనే అమరావతి టు వైజాగ్ వచ్చేయటమే మిగిలిందని అనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates