మోడికి ఇంత అవమానమా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మద్య సంబంధాలు ఎలాగుంటాయో అందరికీ తెలిసిందే. ఏ విషయంలో అయినా ఇద్దరి మధ్య వ్యవహారం ఉప్పునిప్పులాగుంటుంది. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటంలో ఇద్దరిలో ఏ ఒక్కరు తక్కువ కాదనే చెప్పాలి. అవకాశం రావాలే కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు వదులుకోరు. మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్ని గొడవలు జరిగాయో అందరు చూసిందే.

ఇపుడిదంతా ఎందుకంటే శుక్రవారం బెంగాల్ వచ్చిన ప్రధానమంత్రిని మమత అవమానించారు. నిజానికి నరేంద్రమోడిని అవమానించారనే బదులు తన స్ధాయిని తానే మమత దిగజార్చుకున్నారంటే సబబుగా ఉంటుందేమో. ఇంతకీ విషయం ఏమిటంటే యాస్ తుపాన్ వల్ల దెబ్బతిన్న బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లో పరిస్ధితిని మోడి ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఇందులో భాగంగానే కోలకత్తాకు వచ్చిన మోడిని కలవటానికి మమత ఇష్టపడలేదు. సరే ప్రధానిని కలవటం ఆమెఇష్టం అనుకుందాం. అయితే రాష్ట్రంలో జరిగిన నష్టం అంచనాలపై జరిగిన సమీక్షా సమావేశానికి తాను హాజరయ్యేది లేదని, తనకు బదులు ప్రధాన కార్యదర్శి హాజరవుతారని ప్రధాని కార్యాలయానికి చెప్పారు. అన్నట్లుగానే ప్రధాన కార్యదర్శినే పంపారు. అయితే ప్రధాన కార్యదర్శి వచ్చినా మోడి సమీక్ష ప్రారంభించలేదు.

ప్రధాన కార్యదర్శి హాజరైనా సమీక్ష సమావేశం మొదలుకాలేదని తెలుసుకున్న మమత హఠాత్తుగా ప్రధాని సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అప్పటికే మోడి, గవర్నర్ జగదీఫ్ ధడ్కర్ అర్ధగంట వెయిట్ చేశారు. మమత వచ్చిన తర్వాత మోడి సమీక్ష మొదలుపెట్టారు. అయితే సమీక్ష మొదలుకాగానే లేచినిలబడిన మమత తాను చెప్పదలచుకున్నది చెప్పేసి, ఇవ్వదలచుకున్న రిపోర్టును మోడికి ఇచ్చేసి మీటింగ్ నుండి బయటకు వెళ్ళిపోయారు. నిజంగా మోడిని మమత అవమానించారనే చెప్పాలి.

మమత ప్రవర్తనతో మోడి ఆశ్చర్యపోయారు. మమత తప్పుచేసిందన్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే నరేంద్రమోడి వ్యక్తిగత హోదాలో బెంగాల్ కు రాలేదు. ఓ ప్రధాని హోదాలో వచ్చినపుడు ఇష్టం ఉన్నా లేకపోయినా మమత అక్కడ ఉండి తీరాల్సిందే. వ్యక్తుల వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా పాటించాల్సిన నిబంధనలు, మర్యాదలనే ప్రోటోకాల్ అంటారు. ప్రధాని తన రాష్ట్రానికి వచ్చినపుడు ముఖ్యమంత్రిగా పక్కనే ఉండటం మమత కనీస మర్యాద. ప్రోటాకల్ పాటించకపోతే నష్టపోయేది చివరకు తాను కాదు రాష్ట్రమే అన్న విషయం మమత గ్రహించాలి.