అందరు అనుమానిస్తున్నట్లే పశ్చిమబెంగాల్లో నరేంద్రమోడి తనదైన పద్దతిలో ఆపరేషన్ మొదలుపెట్టారా ? ఇదే అనుమానం పెరిగిపోతోంది. సోమవారం బెంగాల్లో ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్టు చేయటంతో రాజకీయ రచ్చ మొదలైంది. మంత్రులిద్దరితో పాటు తనను కూడా అరెస్టు చేయాలని మమతబెనర్జీ నానా యాగీ చేస్తున్నారు. నారదా స్కాంలో మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రత ముఖర్జీ+మరో ఇద్దరు సీనియర్ నేతలను సీబీఐ అరెస్టు చేయటం సంచలనంగా మారింది.
మొన్నటి ఎన్నికల్లో మమతబెనర్జీని ఎలాగైనా ఓడించి బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా శతవిధాల ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఎన్నికలకు ముందే కాకుండా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా మమతను మోడి, షా ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టిందీ అందరు చూసిందే. సరే ఎవరెన్ని రాజకీయాలు చేసినా చివరకు జనాలు మాత్రం మమతనే గెలిపించారు.
నిజంగా మోడి, షా ధ్వయానికి బెంగాల్లో ఓటమి ఘోర అవమానం కిందే లెక్క. అప్పుడే అందరిలోను అనుమానాలు మొదలైపోయాయి. హ్యాట్రిక్ కొట్టి మమత సీఎం అయినా ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వరనే అనుమానాలు మొదలైపోయాయి. దానికి తగ్గట్లుగానే నారదా స్కాంలో సంబంధాలున్నాయని ఇద్దరు మంత్రులను అరెస్టు చేయటం సంచలనంగా మారింది.
విచిత్రమేమిటంటే బెంగాల్లోనే నారదా కాకుండా ఇంకో స్కాం కూడా జరిగింది. దానిపేరు శారద స్కాం. అందులో బీజేపీ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారి+ఆయన కుటుంబసభ్యులు నిందితులుగా ఉన్నారు. సుబేందు కుటుంబం అంతా తృణమూల్ లో ఉన్నపుడు అందరిపైనా ఇదే సీబీఐ కేసులు పెట్టి విచారణపేరుతో అరెస్టులు కూడా చేసింది.
అయితే మారిన రాజకీయ పరిస్దితుల వల్ల ఎన్నికలకు ముందు సుబేందు కుటుంబం మొత్తం బీజేపీలో చేరిపోయింది. శారదా స్కాంలో వీళ్ళల్లో ఎవరిపైనా మళ్ళీ సీబీఐ దాడులు చేసింది లేదు విచారణపేరుతో అరెస్టు చేసిందీ లేదు. అంటే ఎలాంటి వారైనా బీజేపీలో చేరిపోతే పరిశుద్ధులుగా మారిపోతారేమో. బెంగాల్లో ఇపుడే మొదలైన మోడి ఆపరేషన్ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates