గల్లా కుటుంబానికి ప్రభుత్వం షాక్

ప్రముఖ కంపెనీ అమరరాజా కంపెనీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కంపెనీ యాజమాన్యం ఊహించనిరీతిలో ప్రభుత్వం పెద్ద షాకే ఇఛ్చింది. చిత్తూరుకు సమీపంలోని అమరరాజా కంపెనీని మూసేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులిచ్చింది. బ్యాటరీల తయారీలో కంపెనీ యాజమాన్యం కాలుష్య నియంత్ర నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో స్పష్టంగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా, వాతావరణ కాలుష్యానికి కారణమైందన్న ఆరోపణలతో చిత్తూరులో యూనిట్ ను మూసేయాలని నోటీసిచ్చింది.

కంపెనీ యాజమాన్యానికి చిత్తూరుతో పాటు తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి దగ్గర బ్యాటర్ తయారీ యూనిట్లున్నాయి. వీటిల్లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యాజమాన్యానికి కార్పొరేట్ ప్రపంచంలో సంవత్సరాలుగా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే యాజమాన్యం నుండి గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపిగా ఉన్నారు. వరుసగా రెండోసారి గెలిచారు.

అలాగే జయదేవ్ కన్నా ముందే గల్లా అరుణకుమారి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంనుండి అరుణ నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత గల్లా కుటుంబం టీడీపీలో చేరారు. 2014లోనే జయదేవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ ఎంపిగా యాక్టివ్ గానే ఉన్నారు జయదేవ్.

చిత్తూరు యూనిట్ ఆధీనంలోనే ఉన్న భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కూడా ఆమధ్య ఏపిఐఐసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయం వివాదంలో ఉండగానే తాజాగా కాలుష్య నియంత్రణ మండలి నుండి ఏకంగా కంపెనీ మూసేయాలనే నోటీసులు అందటం ఆశ్చర్యంగానే ఉంది. ఇదే విషయమై యాజమాన్యం స్పందిస్తు కాలుష్య నియంత్రణ సమస్యలు తలెత్తకుండా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. మరి నోటీసులు జారీఅయిన నేపధ్యంలో ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏమిటనే విషయం ఆసక్తిగా మారింది.