మమత నిర్ణయమే కొంప ముంచేస్తుందా ?

ఇపుడిదే అందరిలోను అనుమానం పెరిగిపోతోంది. పోలింగ్ జరగాల్సిన మూడు విడతల్లో తాను ప్రచారం చేయకూడదని నిర్ణయించినట్లు మమతబెనర్జీ ప్రకటించారు. మొత్తం 8 విడతల పోలింగ్ లో ఇప్పటికి 5 విడతలు పూర్తయ్యింది. సుమారు 100 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సుంది. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని మమత చాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇదే సమయంలో ఎలాగైనా పశ్చిమబెంగాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా చాలా పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. మమతను దెబ్బకొట్టడమే ధ్యేయంగా మోడి, షా ధ్వయం చేయని ప్రయత్నాలు లేవు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడెక్కడ చీల్చి చెండాడుతున్నారు. సీనియర్లు, గట్టి నేతలనుకున్న వారిని ఏదో విధంగా బీజేపీలోకి చేర్చుకుంటున్నారు.

టీఎంసికి చెందిన 29 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను బీజేపీలోకి లాగేసుకున్నారు. గెలుపు నీదా నాదా అన్నట్లుగా పోటీ హోరాహోరీగా జరుగుతోంది. ఆరోపణలు, విమర్శల విషయంలో ఇటు మమత అటు మోడి, షాలు అన్నీ హద్దులను దాటేశారు. అంటే ఇద్దరు కూడా గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నది అర్ధమైపోతోంది. అందుకనే కాలికి బలమైన దెబ్బ తగిలినా లెక్కచేయకుండా మమత ప్రచారం చేస్తునే ఉన్నారు.

ఇలాంటి నేపధ్యంలో ఇంకా మూడు విడతల పోలింగ్ ఉండగానే ప్రచారానికి వెళ్ళకూడదన్న మమత నిర్ణయం సంచలనంగా మారింది. పెరిగిపోతున్న కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకునే తన బహిరంగసభలు, రోడ్డుషోలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. మూడో విడతలో మాత్రం సింబాలిక్ గా రోడ్డుషో, బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు. మమత ప్రచారాన్ని మానుకున్నంత మాత్రాన బీజేపీ రద్దు చేసుకునే అవకాశాలు లేవు.

ఎందుకంటే మూడు విడతల్లో ఎన్నికలంటే మామూలు విషయంకాదు. మమత ప్రచారం చేయకపోవటాన్ని మోడి, అమిత్ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంది. మమత లాగే బీజేపీ కూడా బహిరంగసభలు, రోడ్డుషోలు రద్దు చేసుకుంటే అది వేరే సంగతి. కానీ ఇప్పటివరకు మోడి, షా లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్ళే అవకాశాలే ఎక్కువున్నాయి. ఏరకంగా చూసినా మమత నిర్ణయం చివరకు కొంపముంచేసేట్లే ఉంది.