కొందరికి కొన్ని భలేగా అచ్చి వస్తాయి. ఎందుకని చెప్పలేం కానీ.. ఇలా కలిసి వచ్చే అంశాలు ఉన్నట్లే.. ఏ మాత్రం అచ్చిరాని అంశాలు ఉంటాయి. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. కోట్లాది ప్రజల్ని ప్రభావితం చేసే రాజకీయ రంగం మీద ఇలాంటి సెంటిమెంట్లు మహా బాగా పని చేస్తుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే చూడండి.. ఆయనకు లక్కీ నెంబరు “6”… ఆరుతో ఏం చేసినా ఆయనకు లాభం జరిగేలా చేస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయనకు “23” అస్సలు అచ్చి రాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ఇందుకు భిన్నంగా ప్రధాని మోడీకి అచ్చి వచ్చింది.. అచ్చిరానిది ఏమైనా ఉందంటే అది కరోనానే. ఒకే అంశంలో అటు ఇమేజ్ ను అదే సమయంలో డ్యామేజ్ ను తెచ్చుకోవటం మోడీకే సాధ్యమని చెప్పాలి. కరోనా ఫస్ట్ వేవ్ వేళ.. ప్రపంచంలో మరే దేశం తీసుకోనంత వేగంగా లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించి.. కేసుల పెరుగుదలకు చెక్ పెట్టేశారు. అంతేనా.. మధ్య మధ్యలో భావోద్వేగ అంశాల్ని తీసుకొచ్చి.. యావత్ దేశం మొత్తం దీపాలు వెలిగించేలా.. గంటలు కొట్టేలా.. ఒక రోజంతా ఇంట్లో నుంచి రాకుండా చేయటమే కాదు.. తాను టీవీ స్క్రీన్ మీదకు వచ్చి ఏమైనా చెబితే చాలు.. 135 కోట్ల మంది ఇట్టే ఫాలో అయ్యేలా చేసే మేజిక్ మోడీ సొంతమన్న ఇమేజ్ తెచ్చుకున్నారు.
కరోనా విషయంలో ఇంత ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. వలస కూలీల ఎపిసోడ్ లో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించటం.. శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసే విషయంలో ఆయన అనుసరించిన విధానం.. కేంద్రం తీరుతో తమ ఇళ్లకు వెళ్లేందుకు వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన బడుగు జీవుల ఎపిసోడ్.. మోడీలోని ‘పాలకుడి’ మీద అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది.
కట్ చేస్తే.. మొదటి దశ ముగిసి.. రెండో దశ ఎంట్రీలోనే ఆయన్ను కరోనా తెగ దెబ్బేసింది. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి.. మిగిలిన విషయాల్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించిన తీరుకు.. ఈ రోజున యావత్ భారత జాతి కరోనాకు ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వ్యాక్సిన్ విషయంలో మోడీ తీసుకోవాల్సిన నిర్ణయాల్ని ఆయన తాజాగా ప్రకటించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ రోజున మహారాష్ట్ర.. గుజరాత్.. ఉత్తర ప్రదేశ్.. పంజాబ్ రాష్ట్రాలతో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం భారీగా ఉందని చెప్పాలి. ఇలా.. ఒకే అంశం ప్రధాని మోడీ ఇమేజ్ ను అమాంతం పెంచేయటమే కాదు.. తీవ్ర విమర్శలకు.. మాసిపోని మరకగా నిలిచిపోయిందని చెప్పాలి.