కేశినేని నాని ఒంటరైపోతున్నారా ?

విజయవాడ తెలుగుదేశంపార్టీలో నేతల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధిగా ఎవరిని ఫోకస్ చేయాలనే విషయంలో నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు తారాస్ధాయికి చేరుకుంటున్నాయి. నిజానికి టీడీపీ నేతల వ్యవహారం ఎలాగుందంటే ఆలూ లేదు చూలు లేదు అల్లుడుపేరు మాత్రం సోమలింగం అన్నట్లుగా ఉంది. ఎన్నికలు జరగలేదు, టీడీపీకి మెజారిటి వస్తుందనే నమ్మకమూ లేదు.

అయినా ఎన్నికలు జరిగిపోయినట్లు, టీడీపీ మెజారిటి డివిజన్లలో గెలిచేసినట్లు అప్పుడే నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. విజయవాడ ఎంపి కేశినేని నాని వర్గం ఒకటి, ఈయనకు ప్రత్యర్ధులుగా ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమామహేశ్వరరావు, బయటకు కనబడకుండా మాజీమంత్రి దేవినేని ఉమ.. ఇలా ఎక్కడికక్కడ అనేక వర్గాలు ఆధిపత్యం కోసం వీధినపడి గొడవలు పడుతున్నాయి.

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఎంపికి వ్యతిరేకంగా బోండా, బుద్ధా, దేవినేని అండ్ ఏకమైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందరు కలిసి కేశినేనిపై చంద్రబాబునాయుడు దగ్గర ఫిర్యాదులు చేశారట. అయితే వీళ్ళ ఫిర్యాదులకు దీటుగా ఎంపి కూడా చంద్రబాబు ముందు పంచాయితీ మొదలుపెట్టారు. దాంతో ఒకళ్ళపై మరొకళ్ళు, ఒకళ్ళకు వ్యతిరేకంగా మరికొందరు ఏకమైపోయి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

నిజానికి ప్రతిపక్షంలో ఉన్నపుడు నేతలంతా ఐకమత్యంతో ఉంటేనే పార్టీ బలోపేతమవుతుందన్న విషయాన్ని అందరు మరచిపోయినట్లున్నారు. పై నేతల్లో ఎవరి వర్గానికి ఎక్కువ టికెట్లు దక్కుతాయి, ఎవరి వర్గంలో ఎంతమంది గెలుస్తారనే విషయాలు కీలకమవ్వటంతో టికెట్ల కోసం ఇప్పటి నుండే గోల మొదలుపెట్టేశారు. ఎన్నికలు జరగాలి, టీడీపీకి మెజారిటి రావాలి అప్పుడు కదా మేయర్ అభ్యర్ధి ఎవరనేది తేలేది. మరి ఇప్పటి నుండే ఎందుకీ గోల ?