జనసేనలో అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఓ విచిత్రమైన కామెంట్ చేశారు. ఇపుడు పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఆదరణతోనే వచ్చే సాధారణ ఎన్నికల్లో సచివాలయంలో కూడా జనసేన అడుగుపెడుతుందన్నారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు గెలుస్తారన్నది నాదెండ్ల మాటలకు అర్ధం. అసెంబ్లీలోకి తమ పార్టీ అభ్యర్ధులు అడుగుపెట్టాలని నాదెండ్ల కోరుకోవటంలో తప్పేలేదు.
అయితే నాదెండ్ల ఒక విషయం మరచిపోయినట్లున్నారు. వచ్చే అసెంబ్లీ సంగతి దేవుడెరుగు. మొన్నటి ఎన్నికల్లోనే జనసేన తరపున ఒక అభ్యర్ధి ఎంఎల్ఏగా గెలిచారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ వైసీపీ అభ్యర్ధిని ఓడించారు. అయితే గెలిచిన తర్వాత రాపాక జనసేన పార్టీతో కన్నా వైసీపీతోనే ఎక్కువగా అంటకాగుతున్నారు.
ఎక్కడ సమావేశం జరుగినా తనను తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రొజెక్టు చేసుకుంటున్నారు. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. ఎలాగంటే పార్టీ తరపున నియమించిన కమిటిల్లో చాలావాటిలో అసలు రాపాకకు స్ధానమే దక్కలేదు. మామూలుగా అయితే పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ కాబట్టి అన్నీ కమిటిల్లోను స్ధానం కల్పించాలి. కీలక కమిటిలకు ఎంఎల్ఏనే ఛైర్మన్ చేయాలి.
కానీ విచిత్రంగా నాదెండ్లను కీలకమైన రాజకీయవ్యవహారాల కమిటికి ఛైర్మన్ గా చేసిన పవన్ తమ ఎంఎల్ఏను మాత్రం వదిలిపెట్టేశారు. ఇక పార్టీ సమావేశాల్లో కూడా రాపాకను వేదికపైన కూర్చోబెట్టలేదు. ఇటువంటి అనేక ఘటనలతో పవన్-రాపాక మధ్య అంతరం పెరిగిపోయింది, అదే చివరకు రాపాకను పార్టీకి దూరంచేసింది. ఇదే విషయాన్ని పవన్ కూడా మీడియాతో మట్లాడుతు తమ ఎంఎల్ఏ రాపాక జనసేనలో ఉన్నారో లేదో తనకే తెలీదని చెప్పటం విశేషం. బహుశా జరిగిన విషయాల కారణంగా రాపాకను జనసేన వదిలేసుకున్నదేమో. అందుకనే వచ్చే ఎన్నికల్లో జనసేన అసెంబ్లీలోకి అడుగుపెడుతందని చెప్పారు.