తిరుమల తిరుపతి దేవస్ధానంపై బీజేపీ మాతృసంస్ధ ఆర్ఎస్ఎస్ కన్నుపడిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్ నేతల నుండి. తిరుపతి మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ మాట్లాడుతూ చేసిన ఆరోపణలు తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి బలహీనత కారణంగా టీటీడీనీ సొంతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానంను రాష్ట్రప్రభుత్వం పరిధినుండి తప్పించి కేంద్రప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో భగవత్ ఆధ్వర్యంలో 7-9 తేదీల మధ్య రహస్య సమావేశం జరిగినట్లు చెప్పారు. టీటీడీని రాష్ట్రప్రభుత్వం నుండి తప్పించేందుకు ఉన్న అవకాశాలు, న్యాయపరమైన చిక్కులపై ప్రముఖ న్యాయ నిపుణులతో భగవత్ చర్చించినట్లు మోహన్ ఆరోపించారు.
టీటీడీకి ఉన్న రూ. 10 వేల కోట్ల డిపాజిట్లు, వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వందల కోట్ల స్ధిరాస్తులపై ఆర్ఎస్ఎస్ కన్నుపడిందన్నారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ఎలాగ ప్రైవేటుపరం చేయబోతున్నారో అలాగే టీటీడీని కూడా రాష్ట్రప్రభుత్వం పరిధి నుండి తప్పించేందుకు కుట్రలు మొదలైపోయినట్లు చెప్పారు. జగన్ బలహీనత వల్లే కేంద్రం ఇదంతా చేస్తోందంటు మండిపడ్డారు. తాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా జగన్ లాంటి బలహీన సీఎంను మాత్రం చూడలేదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates