ఒక ఎంఎల్ఏ ఎన్నిసార్లు తన పదవికి రాజీనామా చేస్తారు ? ఒక్కసారి మాత్రమే చేస్తారు. మహాఅయితే ముందు రాజీనామాను ప్రకటిస్తారు పరిస్దితులను బట్టి తర్వాత రాజీనామా చేసేస్తారు. కానీ విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు మాత్రం ఇప్పటికి మూడుసార్లు రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకారణ నిర్ణయానికి నిరసనగా గంటా శుక్రవారం ఉదయం కార్మికనేతల సమక్షంలో స్పీకర్ ఫార్మాట్ మీద రాజీనామా చేయటం విచిత్రంగా ఉంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెలుగు చూడగానే ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు మొదలుపెట్టారు. వాళ్ళకి ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు మద్దతుగా నిలబడ్డారు. ఆందోళనకు మద్దతుగా అవసరమైతే రాజీనామాలు చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామంటు టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ, వైసీపీ ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి ప్రకటించారు.
అయితే గడచిన ఏడాదిన్నరగా పెద్దగా ఎక్కడా కనబడని గంటా మాత్రం వెంటనే రాజీనామా చేసేశారు. తెల్లకాగితంపై తన రాజీనామా లేఖను రాసి స్పీకర్ కు పంపేశారు. దాంతో ఉక్కు ఆందోళనకు మద్దతుగా గంటా రాజీనామా చేసేశారంటూ ఒకటే ప్రచారం జరిగిపోయింది. అయితే గంటా రాజీనామా చెల్లదనే ప్రచారం మొదలైంది. దాంతో నాలుగు రోజుల తర్వాత విశాఖలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తన లెటర్ హెడ్ మీద రాజీనామా లేఖను రాసి పంపారు.
అయితే దీనిమీద కూడా ఆరోపణలు మొదలయ్యాయి. కండీషన్ రాజీనామాలను స్పీకర్ ఆమోదించరని పైగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేదన్నారు. రాజీనామా లేఖతో గంటా రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో ఏమనుకన్నారో ఏమో శుక్రవారం ఉదయం ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర కార్మిక నేతలతో సమావేశం అయిన గంటా మూడోసారి స్పీకర్ ఫార్మాట్లో తన లెటర్ హెడ్ మీద మళ్ళీ రాజీనామా లేఖ రాశారు. దాన్ని స్పీకర్ కు లేకపోతే స్పీకర్ కార్యాలయానికి పంపే బాధ్యతను కూడా గంటా కార్మిక నేతలకే అప్పగించారు. ఒకే అంశంపై ఇంకా ఎన్నిసార్లు గంటా రాజీనామా చేస్తారో తెలీకుండా ఉంది
Gulte Telugu Telugu Political and Movie News Updates