జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రాధమిక సూత్రాన్ని ఎప్పుడో మరచిపోయినట్లున్నారు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టినట్లు అప్పుడెప్పుడో చెప్పుకున్న పవన్ ఆ విషయాన్ని ఎప్పుడో పక్కన పడేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఉక్కు ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులు రోడ్డెక్కితే వాళ్ళకు రాజకీయపార్టీల నేతలు మద్దతుగా నిలబడ్డారు.
రాజకీయపార్టీల నేతలు కూడా ఆందోళనల్లో పాల్గొంటుంటే బీజేపీ+జనసేన పార్టీల నేతలు మాత్రం ఎక్కడా కనబడటం లేదు. ఈ నేపధ్యంలోనే పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ ఢిల్లీకి వెళ్ళారు. అయితే రోగమొకటైతే మందు మరొకటన్నట్లుగా ఉంది పవన్ తీరు. ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్రమోడిది. దీనికి మోడి పెట్టుబడుల ఉపసంహరణ కమిటి అని మరోటని, ఇంకోటని ఏదో ముసుగు వేస్తున్నారు. మోడి తలచుకుంటే అవుతుంది లేకపోతే కాదంతే.
మరి ఢిల్లీకి వెళ్ళిన పవన్ కలవాల్సింది మోడిని మాత్రమే. అయితే జనసేనాని కలుస్తున్నది పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో పాటు పార్టీ సంస్ధాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను. అవకాశం ఉంటే ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలుస్తారట. అసలు వీళ్ళని కలవటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే. నిజానికి మోడిని కలిసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు.
వ్యవసాయ చట్టాల విషయంలో గడచిన మూడు నెలలుగా ఏమి జరుగుతున్నదో అందరు చూస్తున్నదే. వేలాదిమంది రైతులు ఢిల్లీ శివార్లలో చేస్తున్న ఉద్యమంలో ఇఫ్పటికి సుమారు 58 మంది రైతులు చనిపోయారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని రైతులు ఢిల్లీ సరిహద్దులో అంత పెద్ద ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని మోడి విశాఖపట్నం ఉక్కు ఉద్యమాన్ని పట్టించుకుంటారా అన్నదే అనుమానం. మరిలాంటి పరిస్ధితుల్లో పవన్ కలవాల్సింది మోడినే తప్ప మరోకళ్ళని కాదు. మోడిని తప్ప సంబంధం లేని వాళ్ళని కలిశాను, చర్చించానని చెప్పుకుంటే ప్రచారం కోసం తప్ప పవన్ ఢిల్లీ పర్యటన మరెందుకు పనికిరాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates