జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ నుంచి పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు, పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారి నుంచి ఆయన పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే. అతి మొహమాటస్తుడైన పవన్ కల్యాణ్ ఎవరినీ కాదనలేని పరిస్థితిలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఈ నేపథ్యంలో పరోక్షంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీ నాయకులు “ పవన్ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్“ అనే కామెంట్లను వైరల్ చేస్తున్నారు.
ఏం జరిగింది?
ఈ వారంలోనే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్ జరిగింది. అక్కడే నాలుగు రోజులు ఉండి.. బుధవారమే ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. కనీసం.. నాలుగు రోజులు పూర్తిగా బెడ్ రెస్టు అవసరమని వైద్యులు తెలిపారని జనసేన నాయకులు ఆ సమయంలోనే చెప్పారు.
కానీ, పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని నివాసానికి వచ్చీరావడం తోనే ముఖ్య నేతల నుంచి కీలక నాయకుల వరకు ఆయనను పరామర్శలతో హోరెత్తిస్తున్నారు. మేమే ముందు పరామర్శించాలి.. మేమే పవన్ కల్యాణ్ దృష్టిలో పడాలి.. అన్నట్టుగా పార్టీ నేతలు, ఇతర పార్టీల నాయకులు కూడా ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.
దీంతో వచ్చిన వారిని పరామర్శించేందుకు, వారితో మాట్లాడేందుకు శనివారం సుమారు 6 గంటల పాటు పవన్ వెచ్చించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్‌ను పరామర్శించేందుకు వచ్చిన వారిలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు(టీడీపీ) నుంచి జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు కూడా ఉన్నారు.
అయితే.. ప్రస్తుతం పవన్‌కు రెస్టు అవసరమని.. పదే పదే కుడి చేతిని పైకిలేపి షేక్ హ్యాండ్లు ఇస్తుంటే.. బొకేలు తీసుకునేందుకు చేతులకు పని చెబుతుంటే.. ఆపరేషన్ తాలూకు గాయం ఎప్పటికి మానుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి పవన్‌కు పూర్తిస్థాయిలో రెస్టు ఇవ్వాలని వారు పార్టీనాయకులు, ముఖ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates