క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో కొనసాగింది. కూలి ఫ్లాప్ అయినా అయిదు వందల కోట్ల దాకా వసూలు చేసిందంటే, ఎంతో కొంత మాస్ జనాలకు కనెక్ట్ అయ్యేలా సినిమాని ప్రెజెంట్ చేయడమే కారణం. యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న కనగరాజ్ త్వరలో అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈలోగా లోకేష్ హీరోగా నటించిన డిసి ఈ శుక్రవారం విడుదల కానుంది.

సన్ పిక్చర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ, అనిరుధ్ రవిచందర్ సంగీతం, భారీ నిర్మాణ విలువలు, యాక్షన్ ఎపిసోడ్లు వెరసి ఇన్ని ఆకర్షణలు ఉన్నా జనాల్లో సౌండ్ చేయడంలో డిసి తడబడుతోంది. సాధారణ ప్రేక్షకులకు ఈ మూవీ రిజిస్టర్ కాలేదు. సోషల్ మీడియాలో ఏదో హడావిడి చేయడం తప్ప మన మార్కెట్ ని సీరియస్ గా తీసుకున్నట్టు లేరు. తమిళ వెర్షన్ కి గ్రాండ్ ఈవెంట్ చేశారు కానీ ఇక్కడ ఏదో ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మమ అనిపించేలా ఉన్నారు. కారణం ఏమిటో మరి.

డిసికి దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్.. ధనుష్ కెప్టెన్ మిల్లర్ తీసింది ఇతనే. అది పెద్ద విజయం సాధించకపోయినా టేకింగ్ నచ్చడంతో లోకేష్ ఇతని డైరెక్షన్లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఒక ఫిలిం మేకర్ గా ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ అతను కథానాయకుడిగా మారితే అంతే హైప్ వస్తుందనుకోవడం పొరపాటు. గతంలో ఎస్వి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈ విషయంలో తప్పుగా అంచనా వేసుకుని కెరీర్లను దెబ్బ తీసుకున్న సందర్భాలున్నాయి.

చెన్నై టాక్ ప్రకారం లోకేష్ కనగరాజ్ కు సీరియస్ యాక్టర్ అయ్యే ప్లాన్స్ లేవట. డిసి తనకు సూటవుతుందని దర్శక నిర్మాతలు బలంగా నమ్మడం వల్లే ఒప్పుకున్నారని తెలిసింది. వామికా గబ్బి హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో హింస మోతాదు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. పబ్లిసిటీ సంగతి ఎలా ఉన్నా మౌత్ టాక్ బాగా వస్తే మటుకు మనోళ్లు చూస్తారు. ప్రస్తుతానికి అటెన్షన్ మొత్తం కొరియన్ కనకరాజు మీదే ఉంది. సో డీసికి మన దగ్గర అయితే కాంపిటీషన్ తప్పదు.