రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే విలన్ గా పరిచయమైన ప్రదీప్ రావత్, భిక్షు యాదవ్ పాత్రలో ప్రేక్షకులను ఎంత భయపెట్టాడో ఫిలిం ఫేర్ అవార్డుని అడిగితే చెబుతుంది. అంతగా ప్రభావం చూపించిన ప్రతినాయకుడు ఆ మధ్య కాలంలో లేరంటే అతిశయోక్తి కాదు. అక్కడి నుంచి ప్రదీప్ రావత్ టాలీవుడ్ లో దాదాపు ఎందరో స్టార్ హీరోలతోనూ నటించాడు. చిరంజీవి నుంచి రామ్ దాకా అందరితో హిట్లు ఉన్నాయి.
ప్రదీప్ రావత్ తెరంగేట్రం చేసింది ఎయిత్ బార్ అనే హిందీ చిత్రంతో. కొన్నేళ్లు పెద్దగా పేరు రాలేదు. 1988లో బిఆర్ చోప్రా తీసిన మహాభారత్ సీరియల్ లో అశ్వద్ధామ క్యారెక్టర్ చేయడం గుర్తింపు తీసుకొచ్చింది. ఆఫర్లు వెల్లువెత్తలేదు కానీ చిన్నా చితక అంటూ సపోర్టింగ్ రోల్స్ లో చాలానే చేశారు. అమీర్ ఖాన్ కు మంచి స్నేహితుడు. సర్ఫరోష్ లో సుల్తాన్ గా ప్రదీప్ రావత్ పెర్ఫార్మన్స్ మరిన్ని అవకాశాలు తీసుకొచ్చింది. 2004 రాజమౌళి పరిచయం జీవితాన్ని మార్చింది.
సై తర్వాత ప్రదీప్ రావత్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. టాప్ డైరెక్టర్స్ తో పని చేశారు. సుకుమార్ జగడం, శ్రీను వైట్ల అందరివాడు, వివి వినాయక్ లక్ష్మి, మురుగదాస్ గజినీ, తిరుమల కిషోర్ నేను శైలజ ఇలా ఎన్నో విజయాలు ఆయన ఖాతాలో చేరాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గజినిలో చేసిన డ్యూయల్ రోల్ ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహంలో కూడా ప్రదీప్ రావత్ ఒక పాత్ర చేయడం విశేషం.
యాక్టర్ గా పెద్ద పెద్ద అవార్డులు సాధించకపోయినా ప్రదీప్ రావత్ కు ఆడియన్స్ లో ఉన్న గుర్తింపు పెద్దదే. కొన్ని పాజిటివ్ పాత్రలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఆయన వయసు 74 సంవత్సరాలు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా, భోజ్ పూరి. మరాఠి, మలయాళం తదితర భాషల్లో ప్రదీప్ రావత్ గుర్తుంచుకునే సినిమాలు చేశారు. ఆయన శాశ్వతంగా సెలవు తీసుకున్నప్పటికీ సై భిక్షు యాదవ్ గా మూవీ లవర్స్ కి ఎప్పటికీ గుర్తుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates