విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి మరీ సీరియస్‌గా ఉండేది కాదు కానీ.. మంగళవారం మాత్రం ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. సీఎం విజయ్, త్రిషను ఉద్దేశించి ఒక వల్గర్ కామెంట్ చేసిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయడం.. బదులుగా డీఎంకే కార్యకర్తలు ఆందోళన నిర్వహించడం.. కోర్టు జోక్యంతో ఉదయనిధి విడుదలవడం చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి టైంలోనే తన కొత్త సినిమా జి.డి.ఎన్ ఆడియో వేడుక పెట్టుకున్నాడు సీనియర్ నటుడు మాధవన్. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో వేడుకలో మాధవన్ ఆసక్తికర ప్రసంగం చేశాడు. బయట చాలా పెద్ద డ్రామా నడుస్తున్నా కూడా.. మీడియా వాళ్లు, అతిథులు ఇక్కడికి రావడం గొప్ప విషయమని అతను వ్యాఖ్యానించాడు.
అతనా మాట అనగానే స్టేజ్ మీద ఉన్న సీనియర్ నటుడు సత్యరాజ్ ఆశ్చర్యంగా చూశాడు. బయట జరుగుతున్న డ్రామా వల్ల తనకు టెన్షన్‌గా ఉందని.. రెండు రోజుల్లో తన సినిమా రిలీజవుతుండడంతో ఏమవుతుందో అని గుండె గుబేల్‌మంటోందని మాధవన్ వ్యాఖ్యానించాడు.
జి.డి.ఎన్.. తమిళనాడుకు చెందిన లెజెండరీ ఇంజినీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్. విదేశీ సాంకేతికతను అన్వయించుకుని మోటార్ రంగంలో ఇండియాలో అనేక ఆవిష్కరణలు చేసిన ఘనత ఆయన సొంతం. ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ మోటార్ తయారుచేసింది ఆయనే. మాధవన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను కృష్ణకుమార్ రామ్‌కుమార్ రూపొందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates