ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయం కనుక ఇక్కడ తనకు ఎదురులేకుండా చేసుకునే వ్యూహంలో భాగంగా పిఠాపురంకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు.
ప్రధానంగా రహదారులను అభివృద్ధి పనులు చేపట్టారు. 307 కిలో మీటర్ల రహదారులను నిర్మించనున్నారు. మరమ్మత్తుల కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రహదారులు, సీసీ రోడ్లు వంటివి కూడా 80 శాతానికి పైగా పూర్తి చేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలైన చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలకు సొంత నియోజకవర్గాలున్నాయి. చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా మారింది. జగన్ కు పులివెందుల తిరుగులేని ఆధిపత్యం కట్ట బెడుతుంది. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో శాశ్వతంగా పాగా వేయాలని ప్లాన్ చేస్తుకుంటున్నారు. తనకున్న అవకాశంతో నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు.
అయితే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పార్టీగా జనసేన ఉన్నందున, తనకు ఒక కంచుకోట తప్పక ఉండాలి. పవన్ చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురాన్ని జనసేనకు ఒక కంచు కోటగా మారుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates