పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు, ప్ల‌కార్డులు కూడా ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే.. ఇవి స‌మాజాన్ని రెచ్చ‌గొట్టేలా ఉండ‌డం.. రౌడీయిజాన్ని పెంచేలా ఉండ‌డంతో పోలీసులు ఈ వ్యాఖ్య‌లు స‌హా.. ఈ బ్యాన‌ర్ల‌ను క‌ట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో ఇటీవ‌లి జ‌గ‌న్‌ ప‌ర్య‌ట‌న‌ల్లో ర‌ప్పా-ర‌ప్పా బ్యాన‌ర్లు మాయ‌మ‌య్యాయి. వీటి స్థానంలో కొత్త‌వి చోటు చేసుకున్నాయి.

ఇటీవల వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ శ్రీకాకుళం వెళ్లారు. ఈ స‌మ‌యంలో కూడా ర‌ప్పా-ర‌ప్పా బ్యాన‌ర్లు క‌నిపించ‌లేదు. యువ‌త కూడా.. ర‌ప్పా-ర‌ప్పా అని రాసున్న ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఇక‌, తాజాగా బుధ‌వారం మాజీ సీఎం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. పొగాకు రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌లు రావ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు తాడేప‌ల్లి నుంచి ఆయ‌న దేవ‌ర‌ప‌ల్లికి చేరుకున్నారు.

ఈ స‌మ‌యంలో భారీగా కార్య‌కర్త‌లు, మ‌హిళ‌లు జ‌గ‌న్ పర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ర‌ప్పా-ర‌ప్పా బ్యాన‌ర్ల స్థానంలో వినూత్నంగా బ్యాన‌ర్లు క‌నిపించాయి. “నువ్వే మా రారాజు. నువ్వే మా దేవుడు. నీతోనే మేం న‌డుస్తాం.“ అని రాసున్న ప్ల‌కార్డుల‌ను ప‌లువురు మ‌హిళ‌లు, యువ‌త కూడా ప్ర‌ద‌ర్శించారు. మ‌రోవైపు.. పోలీసులు గ‌ట్టి భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. తొలుత అనుమ‌తి లేద‌ని చెప్పినా.. చివ‌రి నిమిషంలో అనుమ‌తి ఇచ్చారు. నేరుగా దేవ‌ర‌ప‌ల్లికి హెలికాప్ట‌ర్‌లో వెళ్లిన జ‌గ‌న్‌ రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు.

ఈ స‌మ‌యంలో పెద్ద ఎత్తున చేరుకున్న కార్య‌క‌ర్త‌లు.. జ‌గ‌న్ దేవుడంటూ.. కొనియాడారు. ఆయ‌న పాల‌న తిరిగి వ‌స్తుంద‌ని రాసి ఉన్న బ్యాన‌ర్లు ప‌ట్టుకుని క‌నిపించారు. అయితే.. మ‌రోవైపు ర‌ప్పా-ర‌ప్పా అని రాసి ఉన్న ప్ల‌కార్డులు కానీ, బ్యాన‌ర్లు కానీ క‌నిపిస్తాయేమోన‌ని పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ బ్యాన‌ర్లు, ప్ల‌కార్డులు క‌నిపిస్తే.. స‌ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక టీంను రంగంలోకి దింపారు. కానీ .. పోలీసుల ఎఫెక్ట్‌తో ర‌ప్పా-ర‌ప్పా బ్యాన‌ర్లు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.