ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఏపీ-తెలంగాణ జాతీయ రహదారికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని, ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇది అందరి బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.
దీంతో ఎవరీ బూర్గుల రామకృష్ణారావు? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఆయన గురించి శోధన కూడా ప్రారంభమైంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం గురించి.. దీనిలో పార్టిసిపేట్ చేసిన వారి గురించి మాత్రమే తెలుసు. ఆ జాబితాలో బూర్గుల పేరు పెద్దగా కనిపించదు. కానీ.. పవన్ మాత్రం ఏపీ-తెలంగాణ జాతీయ రహదారికి బూర్గుల పేరును ప్రతిపాదించారు.
గ్రామం పేరే ఇంటి పేరుగా
బూర్గుల రామకృష్ణరావు.. తెలంగాణలోని కల్వకుర్తికి దగ్గరలో ఉన్న పడకల్ అనే గ్రామంలో జన్మించారు. ఇంటి పేరు పల్లంరాజు. అయితే.. తండ్రి స్వగ్రామం బూర్గుల కావడం.. ఆ గ్రామం నుంచి వచ్చి పడకల్‌లో స్థిరపడడంతో బూర్గుల గ్రామం పేరే ఇంటిపేరుగా తర్వాత కాలంలో స్థిరపడిపోయింది. హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన రామకృష్ణారావు.. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి, హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లోకి వచ్చారు.
అప్పట్లో జరిగిన ఆంధ్రా ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, భూదానోద్యమం వంటి వాటిలో పాల్గొన్నారు. మాడపాటి హనుమంత రావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసారు. అనంతర కాలంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖులుగా నిలిచారు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. బూర్గుల రెవెన్యూ, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు.
1952లో సీఎంగా..
1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బూర్గుల విజయం దక్కించుకున్నారు. అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. కాగా.. 1956లో వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి ఆయన వ్యతిరేకంగా పనిచేశారు. తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉండాలని నినదించారు. అయితే.. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు మాట్లాడే ప్రాంతాలను కొన్నింటిని విడదీసి.. కోస్తా, రాయలసీమ లతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసింది.
దీనిని వ్యతిరేకించిన బూర్గుల.. అనంతర కాలంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కేరళ రాష్ట్రానికి గవర్నరుగా నియమించింది. తర్వాత.. 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా కూడా పనిచేసారు. 1967, సెప్టెంబర్ 14 న గుండెపోటుతో బూర్గుల తుదిశ్వాస విడిచారు. కాగా..తెలుగు వారి ఐక్యత కోసం కృషి చేసిన నాయకుడు కావడంతోనే పవన్ కల్యాణ్.. బూర్గుల పేరును ప్రస్తావించి.. ఏపీ-తెలంగాణ ల మధ్య ఉన్న జాతీయ రహదారికి ఆయన పేరును పెట్టడంతోపాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates