ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రాన్ని 50 శాతం మేరకు పచ్చదనంతో నింపే ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఉగాది నుంచి రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటడంతో పాటు.. అటవీ సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిధులను వినియోగించుకోనున్నారు.
‘గ్రీన్ కవర్ ప్రాజెక్టు’గా పేర్కొంటున్న ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలతోపాటు.. అన్ని వర్గాల వారు కీలకంగా తీసుకుంటారని పవన్ చెప్పారు. ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాలలోని గ్రామాలను పరిరక్షించడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. సముద్రపు నీరు గ్రామాల్లోకి రాకుండా ఉండాలంటే.. తీర ప్రాంతంలో మొక్కలు పెంచడం ద్వారా కొంత వరకు అరికట్టవచ్చు.
అదేసమయంలో పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూడా మొక్కల పెంపకం కీలకమని పవన్ పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 30 శాతంగా ఉన్న గ్రీనరీని.. 2030 నాటికి.. మరో 7 శాతం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుందన్నారు. ఇక, 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీనరీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే గ్రీనరీ పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. మొత్తంగా 9 లక్షల హెక్టార్లలో మొక్కలు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం నేషనల్ హైవేలపై మొక్కలు పెంచుతున్నారు. గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి రాష్ట్ర రహదారులపైనా ఇలానే గ్రీనరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న 40 శాతం తీరప్రాంతంలో 100 శాతం గ్రీనరీ పెంచేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని.. పచ్చదనం పెంపుకోసం.. కేంద్రం కూడా నిధులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రం కూడా నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates