రాష్ట్రంలోని కీలక పార్టీలకు కార్యకర్తల కొరత వెంటాడుతోంది. నిజానికి కార్యకర్తల దన్నుతోనే ఏ పార్టీ అయినా.. పుంజుకుంటుంది. అధికారంలోకి వచ్చేందుకు కూడా ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్నుగా నిలవాల్సి ఉంటుంది. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలకు.. కార్యకర్తల కొరత వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు కార్యకర్తల కోసం ఆ రెండుపార్టీలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నాయి. త్వరలోనే కార్యకర్తల నియామకాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.
ఈ జాబితాలో ముందున్న పార్టీ జనసేన. గత ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ సాధించిన పార్టీకి కార్యకర్తల కొరత వెంటాడుతోందంటే.. ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ, వాస్తవం. పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. అభిమాన గణం ఉంది. కానీ.. ఇదే సమయంలో జనసేనకు కార్యకర్తల బలం తక్కువగా ఉంది. పవన్‌ను అభిమానించే వారు ఉన్నా.. పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించేవారు.. బలమైన వాయిస్ వినిపించేవారు లేరు.
ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల నియామకాలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తున్న పార్టీకి.. దీనికి అనుబంధంగా మండలాల వారీగా కార్యకర్తలను నియమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నది అధినేత ఆలోచన. గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనకు జోరుగా పనిచేశారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి సొంత కార్యకర్తలతోనే ఎన్నికలకు వెళ్లాలన్నది కీలక నిర్ణయం.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. కార్యకర్తల పరంగా పెను సంక్షోభం ఎదుర్కొంటున్న పార్టీ ఇదే. పార్టీకి కార్యకర్తలు ఉన్నా.. పార్టీ అధిష్టానం నుంచి సరైన దన్నులేక.. కార్యకర్తలు చతికిలపడ్డారు. దీంతో వారు పార్టీకి కూడా దూరమయ్యారు. గత ఐదేళ్లలో పార్టీకి వారు పూర్తిగా దూరమైన ప్రభావం గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్ఠం చేయాలన్నది వైసీపీ వ్యూహం. ఈ క్రమంలోనే కార్యకర్తలకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. మరింత మందిని కొత్తగా పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates