మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది. అయితే ఈ సర్వే క్షేత్రస్థాయిలో నిర్వహించిందికాదు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా మాత్రమే వారి ఆస్తులను అంచనా వేసి నివేదికను విడుదల చేస్తుంది.

ఈ నివేదికలో తాజాగా ఏపీకి చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీలు భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ఇందులో ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి ఆస్తులు 550 శాతం పెరిగాయని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ అంశంపై వైసీపీ వర్గాల్లోనే ఎక్కువగా చర్చ జరుగుతుండడం గమనార్హం. 2014లో రూ.22 కోట్లుగా ఉన్న మిథున్ రెడ్డి ఆస్తులు 2019 ఎన్నికల నాటికి రూ.66 కోట్లకు చేరాయి. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయానికి ఆయన ఆస్తులు రూ.146 కోట్లకు చేరినట్టు సర్వే వెల్లడించింది. అంటే కేవలం పది సంవత్సరాల్లో ఆయన ఆస్తులు సగానికి మించిన స్థాయిలో పెరిగాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి చుట్టూ అక్రమ మద్యం కేసు చర్చకు రావడం మరో కీలక అంశంగా మారింది. ఆయన భారీ ఎత్తున డిస్టిలరీలతో వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో అక్రమ మద్యం వ్యవహారం ఆయన నియంత్రణలోనే సాగిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

ప్రత్యేకంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన ఆస్తులు గణనీయంగా పెరగడంపై పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారని సమాచారం. అదే సమయంలో రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. అక్రమ మద్యం ద్వారా సంపాదించిన ఆస్తులే మిథున్ రెడ్డి సంపద పెరుగుదలకు కారణమన్న వాదన చిత్తూరు జిల్లాలో బలంగా వినిపిస్తోంది.

అయితే దీనికి భిన్నంగా వైసీపీలో మరో వాదన కూడా నడుస్తోంది. మిథున్ రెడ్డికి ఆఫ్రికా దేశాల్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో గనుల వ్యాపారం ఉందని, ఆ వ్యాపారాల ద్వారానే ఆయన ఆస్తులు పెరిగాయని కొందరు నేతలు చెబుతున్నారు.

మొత్తంగా మిథున్ రెడ్డి ఆస్తుల పెరుగుదల వ్యవహారం వెలుగులోకి రావడంతో అక్రమ మద్యం కేసులో మరింత కదలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తుండడం విశేషం.