ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ 2025లో ఏ విధంగా ముందుకు సాగింది? 2024లో 21 స్థానాల్లో విజయం దక్కించుకున్న దరిమిలా.. ఈ ఏడాది ఏవిధంగా పార్టీ అభివృధ్ధికి.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్లాన్ చేశారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
గత ఐదేళ్ల జనసేన పార్టీ గ్రాఫ్‌తో పోల్చుకుంటే.. 2025లో మాత్రం బలమైన పునాదులే పడ్డాయని చెప్పాలి. పార్టీ పరంగానే కాకుండా.. పార్టీ అధినేత పరంగా కూడా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా 2025లో జనసేన ఎదిగింది.
వైసీపీ, టీడీపీ, బీజేపీలకు దూరంగా ఉండేవారు.. జనసేన వైపు చూశారు. తద్వారా చాలా మంది నాయకులు జనసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో గ్రామీణ స్థాయిలో పార్టీ ప్రభావం గతంతో పోల్చితే పెరిగింది. అయితే.. నగరాలు పట్టణాల పరంగా మాత్రం ఇంకా.. ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.
ఉదాహరణకు తిరుపతి, విశాఖపట్నం పట్టణాల్లో జనసేనకు ఉన్న కార్యకర్తలు నాయకులు,.. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు వంటి ప్రధాన రాజకీయ ప్రభావం చూపించే నగరాల్లో లేక పోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లోనూ నాయకత్వాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేశారు.
ఇక, మరో కీలక అంశం.. ఎస్టీ, ఎస్సీలకు పార్టీ మరింత చేరువ కావడం. ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.. పార్టీ పరంగా అందిస్తున్న చేయూతవంటివి ఆయా సామాజిక వర్గాల ప్రజల్లో జనసేనపై గ్రాఫ్‌ను పెంచుతున్నాయి. ఇది పార్టీకి కలిసి వస్తున్న ప్రధాన అంశం.
నిన్న మొన్నటి వరకు వైసీపీకి మాత్రమే అనుకూలంగా ఉన్న రంపచోడవరం, పాడేరు, అరకు.. వంటి గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు, నగరాలువంటి చోట్ల ఇప్పుడు జనసేన కార్యకర్తలు పెరుగుతున్నారు. ఇది పార్టీకి రాబోయే సంవత్సరాల్లో ఓటు బ్యాంకు రాజకీయాల పరంగా చూస్తే.. మేలు జరుగుతుందన్న వాదన ఉంది.
ఇక, పార్టీలో సంస్థాగతంగా ఉన్న లోపాలను సరిచేసేందుకు ఈ ఏడాది 2025లో బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని డెవలప్ చేసేందుకు కమిటీల ఏర్పాటుకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. వీరిలోనూ మహిళలకు ప్రాధాన్యం పెంచడం ద్వారా.. 2025లో జనసేన గ్రామాలకు.. పట్టణాలకు విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
అయితే.. వీటిని వచ్చే ఏడాది సమర్థవంతంగా ఇంప్లిమెంటు చేయడం ద్వారా.. ప్రత్యామ్నాయ పార్టీ నుంచి ప్రత్యామ్నాయ శక్తిగా కూడా పార్టీని డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుందని పార్టీ అధినేత ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా బలమైన ప్రణాళికకు 2025లో జనసేన పునాదులు ప్రారంభించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates