82 వేల కోట్లు పెట్టబోతున్న భారీ కంపెనీ.. సస్పెన్స్ కు తెరతీసిన లోకేష్

రేపు ఉదయం భారీ ప్రకటన అంటూ నిన్న ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన లోకేష్.. దానిని రివీల్ చేశారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ పేరును ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు ఆంధ్రప్రదేశ్‌లో దూసుకురానుంది!.. అని లోకేష్ చెప్పినట్లుగానే ఓ భారీ కంపెనీ ఏపీకి తిరిగి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో రీన్యూ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఐదేళ్ల తర్వాత ఏపీలో తిరిగి అడుగుపెడుతున్న రీన్యూ, రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి రంగంపై భారీ పెట్టుబడి పెట్టనుంది.

రూ. 82,000 కోట్ల పెట్టుబడితో రీన్యూ సంస్థ సౌర ఇంగాట్‌, వాఫర్‌ తయారీ, ప్రాజెక్ట్‌ అభివృద్ధి నుంచి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్స్‌ వరకు హైటెక్‌ రంగాల్లో పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుమంత్ సిన్హా, రిన్యూ క్రాప్ బృందానికి విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో హృదయపూర్వక స్వాగతం తెలిపినట్లు లోకేష్ పేర్కొన్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ గవర్నమెంట్ లోనే పెట్టుబడులు పెట్టాలని రిన్యూ సంస్థ భావించింది. అప్పట్లో ఒప్పందాలు కూడా జరిగాయి. ఆ ప్రక్రియ పూర్తికాక ముందే వైసీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అప్పటికి ఆ సంస్థ కొంత మొత్తం నిధులు వెచ్చించి పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేసుకున్నా.. వైసీపీ ప్రభుత్వం వారికి సహకరించలేదు.

ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ సంస్థ వెళ్ళిపోయింది. తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిన్యూ సంస్థతో సంప్రదింపులు జరిగాయి. తమ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది రాదని, కేంద్రం నుంచి కూడా గ్యారెంటీ పెంచడంతో తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వస్తోంది. ఏపీ నుంచి వెళ్లిపోయిన ప్రతిష్టాత్మక, అంతర్జాతీయ సంస్థను తిరిగి రప్పించడంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కృషిని అంతా ప్రశంసిస్తున్నారు.