ఏపీ పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామంటూ.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. హోం శాఖలో తీవ్ర కలకలం రేపాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులతో పాటు.. దీనికి సంబంధించిన పాత్ర ఉన్న అందరు పోలీసులపైనా సీబీఐ విచారణకు ఆదేశిస్తామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే..ఈ వ్యవహారాన్ని వచ్చే నెల 13కు వాయిదా వేసింది. ఇక, హైకోర్టు వ్యాఖ్యలపై హోం శాఖ వర్గాలు మౌనంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా స్పందించలేదు. అయితే.. చిత్రంగా తన సొంత బాబాయి వివేకా హత్య కేసులో సీబీఐని వద్దన్న వైసీపీ అధినేత జగన్ మాత్రం .. ఇప్పుడు పోలీసులపై సీబీఐ వేయడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. సత్యమేవ జయతే అంటూ కామెంట్ కూడా చేశారు.
ఏం జరిగింది?
సాధారణంగా ఏదైనా ప్రత్యేక కేసులను విచారించేందుకు సీబీఐని వినియోగించడం కామనే. కానీ, పోలీసులపైనే అనుమానాలు.. సందేహాలు.. వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబడుతూ.. హైకోర్టు వారిపైనే విచారణకు సీబీఐని వేస్తామని ప్రకటించింది. దీనికి కారణం.. హైకోర్టు పదే పదే చెబుతున్నా.. పోలీసుల్లో మార్పు రాకపోవడం. ఇటీవల తాడేపల్లికి చెందిన సవేంద్ర రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ సహా.. ఇతర అంశాలను ప్రస్తావించి విమర్శలు గుప్పించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన తాడేపల్లి పోలీసులు.. స్థానికంగా చెరుకు రసం బండిని నిర్వహించుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న సవీంద్ర రెడ్డిని తమతోపాటు జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అయితే.. ఆసమయంలో పోలీసులు మఫ్టీలో ఉన్నారు. మరోవైపు.. సవీంద్రరెడ్డి.. వైసీపీ సోషల్ మీడియాకార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇక, ఎవరు ఆయనను తీసుకువెళ్లారో తెలియని పరిస్థితిలో సవీంద్ర రెడ్డి సతీమణి.. అదే తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు హుటాహుటిన చేరుకుని.. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు.. ఈ దశ నుంచే తప్పులపై తప్పులు చేశారన్నది హైకోర్టు చెప్పిన మాట.
సవీంద్ర రెడ్డి భార్య కిడ్నాప్ ఫిర్యాదు చేస్తే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. కేవలం రిజిస్టర్‌లో నమోదు చేశారు. రెండు రోజులు గడిచినా.. పోలీసులు స్పందించలేదు. పైగా స్టేషన్‌కు వెళ్తే బెదిరించారని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించి.. తన భర్త ఆచూకీ చెప్పించాలని కోరుతూ.. హెబియెస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అన్ని వివరాలు చెప్పాలని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. ఈ క్రమంలోనూ.. అనేక తప్పులు దొర్లాయి. పోలీసులు తీసుకువెళ్లిన సువీంద్ర రెడ్డి.. అసలు ఎవరో తమకు తెలియదని, తమ అదుపులో లేడని పోలీసుల తరఫున చెప్పారు.
అనంతరం.. అదేరోజు..( మంగళవారం) సాయంత్రం తాడేపల్లి పోలీసులు.. సవీంద్రరెడ్డిని సోమవారమే అరెస్టు చేశామంటూ మీడియాకు చెప్పారు. ఈ విషయం వెలుగు చూసిన తర్వాత.. హైకోర్టు పోలీసు వ్యవస్థపై నిప్పులు చెరిగింది. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, ప్రజల స్వేచ్ఛను, జీవించే హక్కులను కూడా కాలరాస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఎవరి ప్రమేయంఉన్నా వదిలి పెట్టేది లేదన్న హైకోర్టు.. పోలీసులనే నిందితులుగా పేర్కొంది.
ఇదేసమయంలో రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం తగ్గిందని సంచలన వ్యాఖ్యలు చేసి.. ఈ కేసును(అంటే పోలీసుల పాత్రను) విచారించేందుకు సీబీఐని వేస్తున్నట్టు తెలిపింది. కాగా.. ఈ వ్యవహారంపైనే జగన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దిగజారాయో.. తాము చెప్పడం కాదని.. హైకోర్టే చెప్పిందని అన్నారు. సీబీఐ విచారణను తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. గతంలో వివేకా కేసును సీబీఐకి అప్పగిస్తే.. తప్పుబట్టిన జగన్ ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates