వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఏకబిగిన విచారించారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన ఆయనను.. ముగ్గురు అధికారులు ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో డిస్టిలరీల(మద్యం తయారు చేసే కంపెనీలు)కు మద్యాన్ని పంపిణీ చేసే విషయంలో టార్గెట్లు విధించడంతోపాటు.. ధరల నిర్ణయం.. కమీషన్ల నిర్ణయం వంటివి మిథున్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని అధికారులు చెబుతున్నారు.
అదేవిధంగా మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన ఓ కంపెనీకి ఓ డిస్టిలరీ నుంచి రూ.5 కోట్ల నిధులు జమ అయ్యాయి. అయితే.. ఈ నిధులను సదరు కంపెనీ వెనక్కి పంపేసింది. ఈ విషయాలపైనే సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. డిస్టిలరీలతో మీరు ఎందుకు చర్చించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించినప్పుడు.. అసలు తనకు ఆ విషయాలు ఏమీ తెలియదని.. తనను కావాలనే ఇరికించారని.. తమకు రాజకీయంగా ప్రజల నుంచి బలమైన మద్దతు ఉందని.. అందుకే తమపై రాజకీయ కక్ష కట్టారని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అసలు తాను ఎంపీనని, నిరంతరం తన నియోజకవర్గం సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైనే ఢిల్లీలో ఉన్నానని తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పినట్టు తెలిసింది.
అలానే.. తన పేరిట ఎలాంటి కంపెనీ లేదన్న మిథున్ రెడ్డి.. తన కుటుంబం నడుపుతున్న కంపెనీకి నిధులు వచ్చిన మాట వాస్తవమేనని.. దీంతో ఆ నిధులను(5 కోట్లు) వెనక్కి పంపేశామని, ఇక కేసు ఏముంటుందని ప్రశ్నించారు. డిస్టిలరీల యజమా నులతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసులో తాను ఒక భాగమయ్యానని, ఈ కేసు నిలబడదని.. తనను అనవసరంగా ఇరికించి వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. తనకు తెలిసినంత వరకు లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సమాచారం ఏమీ లేదన్నారు.
ఇది టీడీపీ నాయకులు సృష్టించిన కేసు అని పేర్కొన్న ఎంపీ.. వారినే అడిగితే బాగుంటుందని చెప్పినట్టు తెలిసింది. మధ్యాహ్నం.. ఓ హోటల్ నుంచి తెప్పించిన భోజనం చేసిన ఆయన.. టీ, కాఫీలను మాత్రం తాగలేదని.. తనకు అలవాటు లేదని చెప్పినట్టు అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటల వరకు కూడా మిథున్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నా.. ఆయన పదే పదే.. తనకు ఏమీ తెలియదని చెప్పడంతోపాటు ఏ ప్రశ్న అడిగినా.. అలా ఎందుకు జరిగిందో కూడా తనకు అర్ధం కావడం లేదని చెప్పినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆయనను తిరిగి పంపేశారు. శనివారం ఉదయం 8 గంటలకు మరోసారి విచారించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates