కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించడంలోనూ.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలోనూ.. ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో పేదలు.. మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న నిత్యావసరాల ధరల నుంచి దుస్తులు, గృహోపకరణాలైన టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్లు.. సహా అన్ని ధరలు తగ్గుతాయని చెప్పారు.
“ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపైనుంచి మన ప్రధాని మోడీ దేశ ప్రజలకు కానుక ఇస్తున్నట్టు ప్రకటించారు. దీపావళి కానుక అని చెప్పినా.. దసరాకు ముందే దీనిని అమల్లోకి తీసుకువచ్చి ఆయన తన నిబద్ధతను చాటుకున్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలో పేద, మధ్యతరగతి వర్గాల జీవన విధానంలో సమూలమైన మార్పు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు” అని పవన్ కల్యాణ్ వ్యాక్యానించారు. అనేక సందర్భాల్లో తనను కూడా వ్యాపారులు కలిసి జీఎస్టీని తగ్గించాలని కోరారని చెప్పారు. అయితే.. మోడీనే ఈ విషయంపై దృష్టి పెట్టి తగ్గించారన్నారు.
ఇక, జీఎస్టీ సంస్కరణలు చేయడంతో సరికాదని.. దీని ఫలాలపై ప్రచారం చేయాల్సిన అవసరం.. కూటమి ప్రభుత్వంగా తమపై ఉందన్నారు. ప్రజలకు జీఎస్టీ ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాన ప్రచారం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు కదిలేలా.. ముఖ్యమంత్రి ఓ కార్యక్రమానికి రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి తానే నేతృత్వం వహిస్తానని చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్లి జీఎస్టీ సంస్కరణల ఫలాలపై వివరించేందుకు తాను నడుంబిగిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఏదైనా మంచి చేసినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ బృహత్కార్యానికి తాను నడుంబిగించాలని నిర్ణయించుకున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates