విశ్వ‌విజేత మోడీ: ఫ‌స్ట్ టైమ్‌ ప‌వ‌న్ సెల్ఫీ వీడియో

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని మించిన నాయ‌కుడు లేడ‌ని ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్ఘాటించారు. మోడీ 75వ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌తానికి భిన్నంగా.. మ‌రో రెండు అడుగులు ముందుకు వేసి.. సెల్ఫీ వీడియోను విడుద‌ల చేశారు. దీనిలో పూర్తిగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఆయ‌న మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీని ‘విశ్వ విజేత‌’గా అభివ‌ర్ణించారు. ఆయ‌న దేశంలోనే కాకుండా.. అంత‌ర్జాతీయంగా కూడా.. పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్నార‌ని తెలిపారు.

మోడీ అనుస‌రిస్తున్న విదేశాంగ విధానంతో భారత్ అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తెలిపారు. మోడీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌నకు హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని పేర్కొన్నా రు. ‘వ‌సుధైక కుటుంబం’ పేరుతో మోడీ నాయ‌క‌త్వంలో భార‌త దేశంలో ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మారుస్తోంద‌న్నారు. ఊహించ‌ని విధంగా ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాల‌తో.. భార‌త దేశం స్థాయి ప్ర‌పంచం ముందు మ‌రింత ఇనుమ‌డించింద‌ని పేర్కొన్నారు.

జీ-20, బ్రిక్స్‌, ఐక్య‌రాజ్య‌స‌మితి వంటి వేదిక‌ల‌పై బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డం ద్వారా భార‌త దేశ ఖ్యాతిని ప్ర‌పం చ వ్యాప్తంగా చేస్తున్న నాయ‌కుడిగా మోడీని అభివ‌ర్ణించారు. అత్యంత క్లిష్ట స‌మ‌యాల్లో భార‌త సైన్యానికి ఫ్రీహ్యాండ్ (స్వేచ్ఛ‌) ఇవ్వ‌డం ద్వారా దేశ భ‌ద్ర‌త‌కు ఆయ‌న ప్ర‌ధాన భూమిక పోషిస్తున్నార‌ని ప‌వ‌న్ చెప్పారు. అదేస‌మ‌యంలో అధునాత సాంకేతిక‌త‌ను వినియోగించుకోవ‌డంతోపాటు.. అధునాతన‌ ఆయుధాల ద్వారా.. భార‌త దేశ ఆయుధ సంప‌త్తిని బ‌లోపేతం చేస్తున్నార‌ని తెలిపారు.

స‌ర్జిక‌ల్‌స్ట్రైక్స్‌, ఆప‌రేష‌న్ సిందూర్‌ల‌లో భార‌త శ‌క్తి ఇనుమ‌డించింద‌ని పేర్కొన్నారు. ఇక‌, కొన్ని ద‌శాబ్దాలుగా వివాదంగా ఉన్న ఆర్టిక‌ల్ 370, ట్రిపుల్ త‌లాక్‌, అయోధ్య రామ‌మందిర వివాదం, మ‌ట్టిలో మాణిక్యాల‌కు కూడా ప‌ద్మ అవార్డులు అందించ‌డం.. వంటివి ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు., దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇంత బ‌ల‌మైన ప్ర‌ధాని మ‌న‌కు దొర‌క‌డం అదృష్టంగా పేర్కొన్న ప్ర‌ధాని.. ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను, రాజ్యాంగ స్ఫూర్తిని నిల‌బెడుతున్నార‌ని.. కొనియాడారు. మొత్తం 4 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ సాంతం ప్ర‌ధాని మోడీని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆకాశానికి ఎత్తేయ‌డం గ‌మ‌నార్హం.