మోడీకి పెద్ద చిక్కు: కేంద్ర మంత్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు

కేంద్రంలో వ‌ర‌సుగా మూడోసారి కూడా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుని స‌రికొత్త రికార్డును సొంతం చేసుకున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. త‌ర‌చుగా కాంగ్రెస్ పార్టీని అవినీతి.. అక్ర‌మాల పార్టీగా చెబుతారు. అంతేకాదు.. వారి హ‌యాంలో స్కీములంటే (ప‌థ‌కాలు).. స్కాములేన‌ని(కుంభ‌కోణాలు) విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. అంతేకాదు.. త‌మ 10 సంవ‌త్స‌రాల పాల‌న‌లో ఒక్క‌ రూపాయి కూడా అవినీతి జ‌ర‌గ‌లేద‌ని.. ఒక్క స్కామ్ కూడా వెలుగు చూడ‌లేద‌ని అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా మోడీకి చిక్కు తెచ్చే వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది.

కేంద్ర ర‌హ‌దారులు, రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి, మ‌హారాష్ట్ర‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు నితిన్ గ‌డ్క‌రీపైనే పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియా స‌హా.. రాజ‌కీయ నాయ‌కుల నుంచి గ‌డ్క‌రీపై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఆయ‌న కూడా దారి త‌ప్పార‌ని.. నిప్పుకు చెద ప‌ట్ట‌డం అంటే ఇదేన‌ని.. శివ‌సేన‌, కాంగ్రెస్ నాయ‌కులు కూడా విమ‌ర్శించారు. దీనికి మోడీ ఏం స‌మాధానం చెబుతార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, సోష‌ల్ మీడియాలో అయితే.. పెద్ద ఎత్తున రీల్స్‌, కామెంట్స్‌, విమ‌ర్శ‌లు, విశ్లేష‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. దీనిలో గ‌డ్క‌రీ అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. వ్య‌క్తిగ‌తంగా మూట‌లు సంపాయిస్తున్నార‌ని కొంద‌రు విరుచుకుప‌డ్డారు.

ఎందుకిలా?

నితిన్ గ‌డ్క‌రీ అంటే.. దేశ‌వ్యాప్తంగా ‘పీల్ గుడ్’ నాయ‌కుడిగా పేరుంది. ఆయ‌న ‘డౌన్ టు ఎర్త్’ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం హ‌రిత ఇంధ‌నాన్ని ప్ర‌మోట్ చేస్తోంది. అంటే.. ప‌ర్యావ‌ర‌ణంలో కాలుష్యం త‌గ్గించే ల‌క్ష్యంతో ప్ర‌స్తుతం ఉన్న పెట్రోల్‌లో 20 శాతం మేర‌కు సాగు ఉత్ప‌త్తుల నుంచి త‌యార‌య్యే ఇథ‌నాల్‌ను మిక్స్ చేసి విక్ర‌యిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ఈ విధానం పుంజుకుంటోంది. అయితే.. ఇథ‌నాల్ వ్య‌వ‌హారంలో స‌ద‌రు కంపెనీల నుంచి గ‌డ్క‌రీకి ముడుపులు ముట్టాయ‌న్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌. దీనికి తోడు.. స్వ‌యంగా ఆయ‌న కుమారుడికే.. రెండు ఇథ‌నాల్‌ క‌ర్మాగారాలు కూడా ఉన్నాయి. దీంతో వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కోస‌మే.. గ‌డ్క‌రీ ఈ విధానం అమ‌లు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు పెల్లుబికాయి.

మంత్రి వివ‌ర‌ణ ఇదీ..

ఇదిలావుంటే.. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు తాజాగా గ‌డ్క‌రీ స్పందించారు. త‌నకు అడ్డ‌దారులు తొక్కాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. నెల‌కు రూ.200 కోట్ల రూపాయ‌లు సంపాయించుకునే మేథ‌స్సు త‌న‌కు ఉంద‌ని, నిజాయితీగా ఆర్జిస్తున్నాన‌ని చెప్పారు. త‌న‌కు మూడు ఫ్యాక్ట‌రీలు ఉన్నాయ‌ని తెలిపారు. చ‌క్కెర త‌యారీ, డిస్టిల‌రీ(మ‌ద్యం త‌యారీ), విద్యుత్ ప్లాంటు ద్వారా.. చేతినిండా సొమ్ములు వ‌స్తున్నాయ‌న్నారు. ఇక‌, యూట్యూబ్ ద్వారా నెల‌కు 4 ల‌క్ష‌లు ఆర్జిస్తున్నాన‌న్నారు. ఇక‌, త‌న‌కు క‌క్కుర్తి ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. శివ‌సేన‌, కాంగ్రెస్ నాయ‌కుల నుంచి మాత్రం విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. దీనిపై ఉద్య‌మం చేస్తామ‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి గ‌డ్క‌రీ వ్య‌వ‌హారం ముదురుతోంది. మ‌రి దీనిపై మోడీ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది చూడాలి.