నిజంగానే వైసీపీ కీలక నేత, రాజంపేట హ్యాట్రిక్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఏదో ఉపరాష్ట్రపతి ఎన్నికను సాకుగా చూపి ఓ నెల పాటో, 15 రోజుల పాటో బయట తిరుగుతూ వ్యవహారాలు చక్కబెట్టుకుందామని ఆయన అనుకున్నారు. అయితే విధి మాత్రం ఆయన అభీష్ఠాన్ని మన్నించలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 5 రోజుల వెసులుబాటు సరిపోతుంది కదా అని చెప్పిన కోర్టు… ఆ 5 రోజుల మేరకే ఆయనకు ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులు రాగానే రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్… ఈ 5 రోజుల్లో ఏం చేశారో తెలియదు గానీ గురువారం గడువు ముగియగానే సాయంత్రం బుద్ధిగా వచ్చి జైలు అధికారుల ముందు లొంగిపోయారు.
వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్న మిథున్ రెడ్డి… లిక్కర్ స్కాంకు సూత్రధారి అన్నది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల భావన. అందుకే ఈ కేసులో ఆయనను ఏ4గా చేర్చారు. విచారణకు రమ్మంటే సుదీర్ఘ కాలం పాటు సాకులు చెప్పిన మిథున్.. చివరాఖరుకు విచారణకు హాజరు కాక తప్పలేదు. అదే సమయంలో అయనను సిట్ పకడ్బందీగానే అరెస్టు చేసింది. దాదాదాపు 50 రోజులపాటు ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. బెయిల్ కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్న మిథున్ కు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నందున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే విషయంలో కోర్టు కొంత మేర సానుకూల దృక్పథాన్ని కనబరచింది.
వైసీపీ అధికారంలో ఉండగా… మిథున్ రెడ్డి హవా ఓ రేంజిలో కొనసాగింది. జగన్ తో తనకున్న సన్నిహితత్వాన్ని ఆసరా చేసుకుని ఆయన చెలరేగిపోయారని చెప్పక తప్పదు. ఈ కారణంగా ఒక్క లిక్కర్ స్కామే కాకుండా… తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, బాబాయి ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గాలను ఆయన మకుటం లేని మారాజుగా వెలుగొందారు. కంటికి కనిపించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను హస్తగతం చేసుకున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోనూ మిథున్ తిప్పిన హవాతో చాలా మంది వైసీపీ నేతలే ఇబ్బంది పడ్డారు. అయితే ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు. అలాంటి మిథున్ ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు జైలులో లొంగిపోయారు. ఇక మళ్లీ ఆయన ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates