వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ లభించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే… పలు షరతులు విధించింది. అంతేకాదు.. కేవలం 5 రోజులు మాత్రమే బెయిల్‌పై బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణంలో నిధులను దారి మళ్లించడంతోపాటు… కొత్త పాలసీ ప్రకారం.. ఎవరు ఎంత మొత్తం కమీషన్లు ఇవ్వాలనే అంశంలో మిథన్ రెడ్డి పాత్ర ఉందని సిట్ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే నాలుగు సార్లు విచారించిన దరిమిలా.. ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్‌రెడ్డి ఇప్పటికి రెండు సార్లు తనకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే.. కోర్టు ఇవ్వలేదు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఈ నెల 9న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ లు ఓటు వేయాల్సి ఉంది. ఈ క్రమంలో తనకు ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని విచారించిన కోర్టు తాజాగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ మధ్య కాలంలో ఎవరితోనూ మాట్లాడరాదని.. ముఖ్యంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కలుసుకు నేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయరాదని తేల్చి చెప్పింది. అదేవిధంగా మీడియాతోనూ మాట్లాడకూడదని ఆంక్షలు విధించింది. ఇతర దేశాలకు వెళ్లరాదని, పాస్ పోర్టును పోలీసులకు స్వాధీనం చేయాలని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates