రాజకీయాల్లో ఏ పార్టీకైనా.. నలుగురుకావాలి. నాయకుల తరఫునే కాకుండా.. పార్టీ తరఫున కూడా స్పందిం చేందుకు అధికార ప్రతినిధులు అన్ని పార్టీలకూ చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏపీలోని కీలక పార్టీలు పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా మూడు పార్టీలకు అధికార ప్రతినిధులు లేకుండాపోయారు. వీటిలో రెండు కూటమిలోనే ఉండగా.. మరొకటి కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీల్లోనూ అధికార ప్రతినిధుల కొరత వెంటాడుతోంది. ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా.. అంతర్గతంగా మాత్రం చర్చకు వస్తోంది.
జనసేన పార్టీ విషయానికి వస్తే.. అధికార ప్రతినిధుల కొరత వెంటాడుతోంది. నిజానికి ఆది నుంచి కూడా పెద్దగా అధికార ప్రతినిధులు లేని పార్టీగా జనసేన పేరుతెచ్చుకుంది. గతంలో నాదెండ్ల మనోహర్ అన్నీ తానై చూసుకునేవారు. ఇక, ఇప్పుడు మంత్రిగా ఉన్నా కూడా.. పార్టీ వ్యవహారాలను ఆయనే చూసుకోవాల్సి వస్తోంది. దీంతో తనపై ఒత్తిడి పెరిగిందని.. అటు తన శాఖను, ఇటు పార్టీ వ్యవహారాలను కూడా బ్యాలెన్స్ చేయలేక పోతున్నానని.. నాదెండ్ల చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధికార ప్రతినిధులను నియమించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
విశాఖలో జరిగిన సమావేశంలో ఇటీవల ఈ విషయంపై చర్చ జరిగింది. అందుకే.. త్రిశూల్ వ్యూహాన్ని ప్రకటించారు. కీలక నేతలను ఎంపిక చేసి.. వారిని అధికార ప్రతినిధులుగా నియమించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. దగ్గుబాటి పురందేశ్వరి హయాంలో నలుగురు అధికార ప్రతినిధులుగా ఉండేవారు. అయితే.. ఆమె తర్వాత వారిని కూడా పక్కన పెట్టారు. ఫలితంగా బీజేపీలో ఏపీ చీఫే ఇప్పుడు అన్నీ చూసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఆయనకు భారం కావడంతో అధికార ప్రతినిధులను ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోనూ.. అధికార ప్రతినిధుల కొరత ఉంది. వాస్తవానికి పార్టీ అధిష్టానం అధికార ప్రతినిధులను ఇచ్చినా.. పార్టీ చీఫ్ షర్మిల మాత్రం తనకు ఎవరూ అవసరం లేదని చెప్పడంతో అధికార ప్రతినిధులుగా ఉన్నవారు సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఎవరూలేని పార్టీగా కాంగ్రెస్ కూడా మిగిలింది. అయితే.. అధికార ప్రతినిధులు ఉంటే మేలా? కీడా? అంటే.. నిర్మాణాత్మకంగా వ్యవహరించే వారితో మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే అధికార ప్రతినిధి పోస్టుకు భారీ డిమాండ్ కూడా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates