మీకు బెయిల్ ఇవ్వ‌లేం: మిథున్ రెడ్డికి కోర్టు షాక్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంలో ఏ-4గా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీల‌క నాయ‌కుడు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఆయ‌న‌తోపాటు.. మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య్ రెడ్డి, జ‌గ‌న్ మాజీ ఓఎస్‌డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ సంస్థ ఆడిట‌ర్ బాలాజీ గోవింద‌ప్ప‌లు విజ‌య‌వాడ జైల్లో ఉన్నారు. అయితే.. వీరు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ.. విజ‌య‌వాడలోని ఏసీబీ కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై నాలుగు సార్లు విచార‌ణ కూడా జ‌రిగింది. వారికి బెయిల్ ఇవ్వ‌రాద‌ని.. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్య‌క ద‌ర్యాప్తు బృందం అధికారులు కోర్టుకు విన్న‌వించారు.

దీనికి సంబంధించి జ‌రిగిన అన్ని విచార‌ణ‌ల్లోనూ సిట్ అధికారులు బ‌ల‌మైన ఆధారాల‌ను చూపించారు. అంతేకాదు.. మ‌ద్యం స్కాంలో మిథున్ రెడ్డి న‌గ‌దును త‌రలించ‌డంలోనూ.. స్కాంకు రూప‌క‌ల్ప‌న చేయ‌డంలోనూ పాలుపంచుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు చెందిన కంపెనీకి రూ.5 కోట్లు వ‌చ్చాయ‌ని.. తెలివిగా వాటిని తిరిగి ఇచ్చేశార‌ని కూడా గ‌త వాద‌న‌ల్లో వినిపించారు. ఇక‌, మాజీ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి కూడా ఈ స్కాంలో కీల‌క రోల్ పోషించార‌ని తెలిపారు. మ‌ద్యం కుంభ‌కోణానికి రూప‌క‌ల్పన చేసిన వారిలో ఆయ‌న కూడా ఉన్నార‌ని చెప్పారు. అలాగే.. మాజీ ఓఎస్‌డీ కృష్ణ‌మోహ‌న్‌.. అనేక సంద‌ర్భాల్లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో పాలు పంచుకున్నార‌ని తెలిపారు.

ఇక‌, ఆడిట‌ర్ గోవింద‌ప్ప‌.. మ‌ద్యం కుంభ‌కోణం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాలి? అనే విష‌యాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు.. 150 కోట్ల‌ను దారిమ‌ళ్లించార‌ని సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించా రు. ఇక‌, పిటిష‌నర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు మాత్రం అస‌లు త‌మ వారికి ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని.. ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని వివ‌రించారు. ఎంపీకి అస‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకునే అవ‌కాశం లేద‌ని కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఇరు ప‌క్షాల వాద‌న‌లు న‌మోదు చేసుకున్న కోర్టు.. తాజాగా తీర్పు వెలువ‌రించింది.

సిట్ అధికారులు(ప్రాసిక్యూష‌న్‌) ఇచ్చిన వివ‌రాలు.. దాఖ‌లుచేసిన రెండు చార్జిషీట్ల‌లో నిందితులు త‌ప్పు చేశార‌న్న విష‌యం స్ప‌ష్టంగా ఉంద‌ని.. బ‌ల‌మైన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని ఏసీబీ కోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. బెయిల్ పొందేందుకు.. ఈ న‌లుగురిలో ఎవ‌రూ అర్హులు కార‌ని పేర్కొంది. ఎంపి అయినా.. రాష్ట్రానికి చెందిన వారేన‌ని.. గ‌తంలో అనేక కేసులు కూడా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డిన కోర్టు.. బెయిల్ ఇవ్వ‌లేమ‌ని పేర్కొంటూ.. పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను ముగించింది. దీంతో పై న‌లుగురు హైకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని వారి త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు.